బిట్​ బ్యాంక్​ : శీతోష్ణస్థితి మార్పు

బిట్​ బ్యాంక్​ : శీతోష్ణస్థితి మార్పు
  •     ప్రస్తుతం మానవుడు ఎదుర్కొంటున్న సవాళ్లలో ప్రధానమైంది శీతోష్ణస్థితి మార్పు. 
  •     భూమిపై అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే దీని ప్రభావం స్వల్ప స్థాయి నుంచి తీవ్రస్థాయిలో కనిపిస్తున్నట్లు అనేక అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేశాయి.
  •     శీతోష్ణస్థితి మార్పు అధ్యయనానికి యునైటెడ్​ నేషన్స్​ ఎన్విరాన్​మెంట్​ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన ఇంటర్​ గవర్నమెంటల్​ ప్యానల్​ క్లైమేట్​ ఛేంజ్​ ప్రకారం సహజ, మానవ జనిత కారణాల ద్వారా ప్రపంచ శీతోష్ణస్థితిలో సంభవిస్తున్న పరిశీలించదగ్గ అసాధారణ మార్పు శీతోష్ణస్థితి మార్పు. 
  •     శీతోష్ణస్థితి మార్పుకు భూతాపం ప్రధాన కారణమని 1990లో తొలిసారిగా ఐపీసీసీ తన మొదటి నివేదికలో తేల్చింది. 
  •     భూతాపాన్ని అర్థం చేసుకోవాలంటే తొలుత సౌరపుటం గురించి తెలుసుకోవాలి. భూమిపైకి చేరే సౌరవికిరణం, సౌరపుటం. భూమిపై వాయు, ఘన, ద్రవ, జీవ, నిర్జీవ పదార్థాలన్నీ ఈ సౌర వికిరణాన్ని గ్రహించి తిరిగి దీర్ఘతరంగ దైర్ఘ్య పరారుణ కాంతి రూపంలో రోదసిలోకి పరావర్తనం గావిస్తాయి. ఇలా అయితే భూమి పూర్తిగా చల్లబడాలి. అలా జరగపోవడానికి కారణం కార్బన్ డయాక్సైడ్​.
  •     వాతావరణంలోని కార్బన్​ డయాక్సైడ్​ సౌరశక్తిని గ్రహించి దాని పరావర్తనాన్ని అడ్డుకుంటుంది. ఫలితంగా భూవాతావరణం వేడెక్కుతుంది. 
  •     వాతావరణం అంతటా కార్బన్​ డయాక్సైడ్​ విస్తరించడం ద్వారా భూమి ఉపరితల ఉష్ణోగ్రతలను ఈ విధంగా కార్బన్​ డయాక్సైడ్​ నియంత్రిస్తుంది. 
  •     శిలాజ ఇంధన అధిక వినియోగం ద్వారా వాతావరణంలోకి అధిక కార్బన్​ డయాక్సైడ్​ విడుదలై అది గ్రహించే వేడి కూడా పెరిగి భూతాపం సంభవిస్తుంది. 
  •     పారిశ్రామికీకరణానికి ముందు 6.5 లక్షల ఏళ్ల కాలంలో వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్​ మోతాదు కేవలం 120 పీపీఎం(పార్ట్స్​ పర్​ మిలియన్​) పెరగగా, 175‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 నుంచి 2012 నాటికి అదే 120 పీపీఎం మోతాదులో పెరిగింది. 
  •     కార్బన్​ డయాక్సైడ్​ మాత్రమే కాకుండా ఇతర మానవ జనిత ఉద్గారాలు భూతాపానికి కారణమవుతున్నాయని ఐపీసీసీ పేర్కొంది. వీటిని గ్రీన్​హౌస్​ ఉద్గారాలని అంటారు. 
  •     గ్రీన్​హౌస్​లోని తెర సౌరశక్తిని గ్రహించి దాని పరావర్తనాన్ని అడ్డుకోవడం ద్వారా లోపలి ఉష్ణోగ్రత పెరగడం గ్రీన్​హౌస్​ ప్రభావం. కార్బన్​ డయాక్సైడ్​, ఇతర ఉద్గారాలూ గ్రీన్​హౌస్​ తెరవలె వ్యవహరిస్తున్నాయి. కనుక వీటిని గ్రీన్​హౌస్​ ఉద్గారాలు అంటారు. 
  •     ఐపీసీసీ గుర్తించిన ముఖ్యమైన గ్రీన్​ హౌస్​ ఉద్గారాలు కార్బన్​ డయాక్సైడ్​, మీథేన్​, నైట్సస్​ ఆక్సైడ్​, పర్​ఫ్లోరోకార్బన్స్​, హైడ్రోప్లోరోకార్బన్స్, సల్ఫర్ హెక్జాప్లోరైడ్​. 
  •     శిలాజ ఇంధనాల అధిక వినియోగం, అడవుల నరికివేత ద్వారా కార్బన్ డయాక్సైడ్​ విడుదలవుతుంది. 
  •     ఘనవ్యర్థ పదార్థ వినియోగం, విరి మడుగులు, పశువుల పేగులు మీథేన్​ గ్యాస్​ విడుదలకు మూలం.
  •     రసాయన ఎరువులు, విస్ఫోటకాల ఉత్పాదన, వినియోగం నైట్రస్​ ఆక్సైడ్​ విడుదలకు మూలం.
  •     రిఫ్రిజిరెంట్లు, అగ్నిమాపక పదార్థాలు, స్పే క్యాన్​ల వినియోగం వల్ల పర్​ఫ్లోరో కార్బన్స్, హైడ్రో ఫ్లోరో కార్బన్స్​, సల్ఫర్​ హెక్జాఫ్లోరైడ్​ విడుదలవుతాయి. 
  •     అధిక జనాభా ద్వారా సహజ వనరులు విపరీత వినియోగానికి గురై కార్బన్​ డయాక్సైడ్​ లాంటి ఉద్గారాలు పెరిగాయి. ముఖ్యంగా బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాల అధిక వినియోగం ద్వారా కార్బన్​ డయాక్సైడ్​ విపరీతంగా పెరగడంతో భూతాపానికి తద్వారా శీతోష్ణస్థితి మార్పు సంభవిస్తుంది. 
  •     వ్యవసాయ విస్తరణ మానవ నివాసాలు, కలప, రైల్వే, రోడ్డు మార్గాల విస్తరణకు ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో అడవులు క్షీణించాయి. మొక్కలు కార్బన్​ డయాక్సైడ్​ను గ్రహించి సెల్యులోజ్​ రూపంలో నిర్బంధించి తద్వారా అవి కార్బన్​ తొట్టెలుగా వ్యవహరిస్తాయి. అడవుల నరికివేత ద్వారా కార్బన్​ డయాక్సైడ్​ స్థాయి పెరిగి భూతాప తీవ్రత కూడా పెరిగింది.