- బిట్‌కాయిన్ మన దేశంలోనూ పాగా?
- ఈ కరెన్సీలో 1.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసిన ఎలన్ మస్క్
- గ్లోబల్‌గా ఆదరణ పెరుగుతున్నా..నెగిటివ్‌గానే ప్రభుత్వం
- ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల బ్యాన్‌పై ఓ బిల్లు?
బిజినెస్‌డెస్క్, వెలుగు: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్ కిందటి నెల 1.5 బిలియన్ డాలర్లను బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేశాడు. అంతేకాకుండా భవిష్యత్‌లో బిట్‌కాయిన్ పేమెంట్లను టెస్లా అంగీకరిస్తుందని పేర్కొన్నాడు. అత్యంత విలువైన కంపెనీ తన ప్రొడక్ట్‌లు, సర్వీస్‌లపై బిట్‌కాయిన్ పేమెంట్స్‌ను అంగీకరిస్తామని ఒప్పుకోవడంతో ఈ క్రిప్టో కరెన్సీకి కొత్త రెక్కలొచ్చాయి. బిట్‌కాయిన్ ఏకంగా 20 శాతం పెరిగి 47 వేల డాలర్లను టచ్ చేసి కొత్త రికార్డ్‌లను క్రియేట్ చేసింది. గ్లోబల్‌గా బిట్‌కాయిన్ లేదా ఇతర క్రిప్టో కరెన్సీలకు ఆదరణ పెరుగుతుండడంతో ఇండియన్ గవర్నమెంట్ కూడా ఓ మెట్టు కిందకు దిగకతప్పదని క్రిప్టో ఇండస్ట్రీ అంచనావేస్తోంది. ఇండియాలో కూడా బిట్‌కాయిన్ పేమెంట్స్ ప్రారంభమవుతాయని ఆశిస్తోంది.
నిషేధమా? నియంత్రణా?
ఎలన్ ప్రకటనతో క్రిప్టోకరెన్సీలను ఇన్వెస్ట్‌మెంట్ అసెట్‌గా చూడడంపై ఇన్వెస్టర్లకు నమ్మకం పెరుగుతుందని క్రిప్టో ఎక్స్చేంజ్ కాయిన్‌డీసీఎక్స్ ఫౌండర్ సుమిత్ గుప్తా అన్నారు. గత కొంత కాలం నుంచి క్రిప్టోకరెన్సీలలో ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు డబ్బులు పెడుతున్నారని చెప్పారు. ప్రస్తుత డెవలప్‌మెంట్లను పరిశీలించి ఇన్వెస్టర్లు, ఇండియన్ క్రిప్టో ఎకోసిస్టమ్‌కు సాయపడే రెగ్యులేషన్లను ప్రభుత్వం తీసుకొస్తుందని అంచనావేశారు. డెవలప్ అయిన దేశాలు క్రిప్టోకరెన్సీలకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. రెగ్యులేటరీలు, ప్రభుత్వం ఈ కరెన్సీలపై వెనకడుగేస్తే, టెక్నాలజీ రేస్‌లో ఇండియా వెనకబడిపోతుందని అభిప్రాయపడ్డారు. చాలా దేశాలు క్రిప్టో కరెన్సీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కొన్ని దేశాలు ఈ కరెన్సీలను బ్యాన్ చేయడం కంటే రెగ్యులేట్ చేయడం బెటర్ అని చూస్తున్నాయి. మనీ లాండరింగ్‌కు వాడే అవకాశం ఉండడంతో పాటు, స్పెక్యులేటివ్ నేచర్ వలన బిట్‌కాయిన్‌పై గ్లోబల్ రెగ్యులేషన్ అవసరమని యురోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టెన్ లాగార్డ్ అన్నారు. గత కొన్నేళ్ల నుంచి బిట్‌కాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీలకు ఆదరణ పెరుగుతోంది. చాలా మంది ఎనలిస్టుల బిట్‌కాయిన్‌ను గోల్డ్‌కు ఆల్టర్నేటివ్‌గా చూస్తున్నారు. బ్రోకరేజి కంపెనీ జెప్పరీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ గ్లోబల్ హెడ్ క్రిష్ వుడ్ తన పోర్టుపోలియో గోల్డ్ వాటా తగ్గించి, బిట్‌కాయిన్ వాటాను 5 శాతం పెంచాడు. ఒక సారి ప్రభుత్వం స్మార్ట్, సెన్సిబుల్ రూల్స్‌ను తీసుకొస్తే, ఇండియన్ క్రిప్టో మార్కెట్‌లోకి పెద్ద మొత్తంలో పెట్టుబడులొస్తాయని గుప్తా చెప్పారు.
బిట్‌కాయిన్‌కు ఎలన్ మస్క్ బూస్టప్..
మనీ ల్యాండరింగ్‌కు వాడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో క్రిప్టోకరెన్సీపై ప్రభుత్వం, రెగ్యులేటరీ సంస్థలు వెనకడుగేస్తున్నాయి. ఇలాంటివేమి జరగకుండా చూసుకుంటామని క్రిప్టోకరెన్సీ ఇండస్ట్రీ చెబుతున్నప్పటికీ ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు. ఎలన్ మస్క్ ప్రకటనతో ఈ ఇండస్ట్రీకి పెద్ద బూస్టప్ వచ్చిందని కాయిన్‌డీసీఎక్స్ ఫౌండర్ సుమిత్ గుప్తా అన్నారు. గ్లోబల్‌గా క్రిప్టో కరెన్సీలకు ఆదరణ పెరుగుతుండడంతో ఇండియన్ గవర్నమెంట్, రెగ్యులేటరీ సంస్థలు వీటిని పట్టించుకోకుండా ఉండకూడదని పేర్కొన్నారు. ఎలన్ మస్క్ ప్రకటనతో ఇండియాలో కూడా బిట్‌కాయిన్‌ను కొనేందుకు పోటీ పెరిగింది. దీంతో కొన్ని క్రిప్టో ఎక్స్చేంజ్‌లు సోమవారం సరిగ్గా పనిచేయలేదు. ఈ వార్త తర్వాత జెబ్‌పే యూజర్లు రెట్టింపయ్యారని క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ జెబ్‌పే సీఈఓ రాహుల్ పగిడిపాటి చెప్పారు. కంపెనీల బ్యాలెన్స్ షీట్‌లలో బిట్‌కాయిన్ స్ట్రాంగ్ రిజర్వ్ అసెట్‌గా ఉంటుందని పేర్కొన్నారు. సెంట్రల్ బ్యాంకులు కూడా బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేస్తాయని ఆశించారు. ఇండియన్ గవర్నమెంట్ బిట్‌కాయిన్‌ను బ్యాన్ చేయకుండా ఉండడానికి ఎలన్ ప్రకటన తోడ్పడుతుందని అంచనావేశారు.
త్వరలో కేబినేట్‌కు క్రిప్టోకరెన్సీ బిల్లు..
ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను ఇండియాలో బ్యాన్ చేయాలని ఓ హై లెవెల్ కమిటీ సలహాయిచ్చిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఓ ప్రశ్నకు రాజ్యసభలో ఆమె సమాధానం చెప్పారు. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌పై కఠినమైన గైడ్‌లైన్స్‌ను ఇష్యూ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని చెప్పారు. ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ(ఐఎంసీ) వర్చువల్ కరెన్సీకి సంబంధించిన అంశాలను స్టడీ చేసిందని అన్నారు. ప్రభుత్వాలు ఇష్యూ చేసే క్రిప్టో కరెన్సీలను మినహాయించి, అన్ని రకాల ప్రైవేట్ కరెన్సీలను ఇండియాలో బ్యాన్ చేయాలని ఈ కమిటీ రికమండ్ చేసిందని పేర్కొన్నారు. దేశంలో క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌కు ఎటువంటి లీగల్ వాల్యూ ఉండదని 2018–19 బడ్జెట్‌లోనే పేర్కొన్నామని సీతారామన్ అన్నారు. డిజిటల్ ఎకానమీని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం బ్లాక్ చెయిన్ టెక్నాలజీని వాడుతుందని చెప్పారు. క్రిప్టోకరెన్సీ బిల్లును ప్రభుత్వం పైనలైజ్ చేస్తోందని, త్వరలో యూనియన్ కేబినేట్‌కు ఈ బిల్లు వెళుతుందని ఓ ప్రశ్నకు రాజ్యసభలోని ఫైనాన్స్ మినిస్ట్రీ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానమిచ్చారు. క్రిప్టోకరెన్సీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్లను ప్రాసెస్ చేయడాన్ని 2018 లో ఆర్‌బీఐ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. కానీ, సుప్రీం కోర్టు కిందటేడాది ఈ బ్యాన్‌ను తొలగించింది. క్రిప్టోకరెన్సీలు నిజమైన కరెన్సీ కాదు, అసెట్స్ కూడా కావని ఠాకూర్ పేర్కొన్నారు. దీంతో ఇవి ఆర్‌బీఐ లేదా సెబీ రూల్స్ కిందకు రావడం లేదని చెప్పారు. దీనిపై ప్రభుత్వం ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీని ఏర్పాటు చేసిందని, ఈ కమిటీ తన రిపోర్ట్‌ను ఇచ్చిందని ఠాకూర్ చెప్పారు. ఆ తర్వాత ఈ అంశంపై ఓ టెక్నాలజీ గ్రూప్‌తో చర్చలు జరిగాయని, కేబినేట్ సెక్రటరీ నాయకత్వంలోని సెక్రటరీస్ కమిటీ కూడా తన రిపోర్ట్‌ను ఇచ్చిందని అన్నారు. క్రిప్టోకరెన్సీ బిల్లు చివరి దశలో ఉందని, కేబినేట్‌కు త్వరలో పంపుతామని చెప్పారు.
For More News..