న్యూఢిల్లీ: యూఎస్ ప్రెసిడెంట్‌గా ట్రంప్ ఎన్నికకావడంతో క్రిప్టోకరెన్సీలకు రెక్కలొచ్చాయి. బిట్‌కాయిన్ బుధవారం కొత్త గరిష్టాలను టచ్ చేసింది. క్రిప్టోలను ట్రంప్ సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. బిట్‌కాయిన్ ధర మొదటిసారిగా 75 వేల డాలర్లను దాటి 75,353 డాలర్ల (రూ.62.5 లక్షల) దగ్గర ఆల్ టైమ్ హైని రికార్డ్ చేసింది.
ఈ క్రిప్టో కరెన్సీ 8 శాతం ర్యాలీ చేయగా, ఎథీరియం 7 శాతం పెరిగి 2,647 డాలర్లకు చేరుకుంది. వీటితో పాటు డోజికాయిన్ 17 శాతం, సుయి 18 శాతం, షిబాఇను 5 శాతం, కార్డానో 8 శాతం, అవలాంచ్ 13 శాతం, యూనిస్వాప్ 29 శాతం పెరిగాయి. టాప్ ఇండియన్ క్రిప్టో ఎక్స్చేంజ్‌లు కాయిన్‌స్విచ్, కాయిన్ డీసీఎక్స్‌లో ట్రేడింగ్ వాల్యూమ్స్ భారీగా పెరిగాయి.