వెస్ట్ బెంగాల్: టీఎంసీ చీఫ్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. కోల్కతా హత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తోన్న జూనియర్ డాక్టర్లు మమతా బెనర్జీకి మరోసారి ఊహించని షాక్ ఇచ్చారు. దీంతో జూనియర్ డాక్టర్ల తీరుపై దీదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అసలేం జరిగిందంటే.. రాష్ట్ర రాజధాని కోల్కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై అత్యంత పాశవికంగా హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా తోటి జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దీంతో జూడాలను రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. అయితే, చర్చలను లైవ్ స్ట్రీమింగ్ చేయాలని జూడాలు కండిషన్ పెట్టడంతో ఇందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో చర్చలు ముందుకు సాగలేదు. తాజాగా మరోసారి సీఎం మమతా బెనర్జీ జూనియర్ డాక్టర్లను చర్చలకు ఆహ్వానించింది. దీంతో సీఎం నివాసానికి వెళ్లిన జూడాలు చివరి నిమిషంలో మమతా బెనర్జీకి ఊహించని షాక్ ఇచ్చారు.
Also Read :- ప్రతిపక్ష నేత నాకు ప్రధాని పదవి ఆఫర్ చేశారు
ప్రభుత్వం తమ కండిషన్లకు ఒప్పుకోకపోవడంతో నివాసం దగ్గరకు వచ్చిన జూడాలు సీఎం ఇంట్లోకి వెళ్లకుండా వెనుదిరిగారు. దీంతో జూడాల తీరుపై సీఎం దీదీ అహసనం వ్యక్తం చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో జూడాలను చర్చలకు ఆహ్వానిస్తున్నా.. వారు పదే పదే తనను అవమానిస్తున్నారని మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, జూడాలకు మధ్య చర్చలు మరోసారి ముందుకు సాగకపోవడంతో జూనియర్ డాక్టర్లు ఆందోళనను తిరిగి కంటిన్యూ చేయనున్నట్లు తెలుస్తోంది.