Ranji Trophy 2023-24: బోర్డు పెద్దల ఆధిపత్య పోరు.. ఒక రాష్ట్రంలో రెండు క్రికెట్ జట్లు

Ranji Trophy 2023-24: బోర్డు పెద్దల ఆధిపత్య పోరు.. ఒక రాష్ట్రంలో రెండు క్రికెట్ జట్లు

జనవరి 5 నుంచి ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ 2023-2024 రంజీ ట్రోఫీ సీజన్ ప్రారంభమవ్వగా.. తొలి రోజే ఊహించని ఘటన చోటుచేసుకుంది. బీహార్ క్రికెట్ అసోషియేషన్(బీసీఏ) పెద్దలు మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు.. దేశ క్రికెట్ పరువునే బజారుకీడ్చింది. బీసీఏ అధ్యక్షుడు, సెక్రటరీ ఎవరికి వారు అన్నట్లుగా నడుచుకుంటున్నారు. దీంతో వీరి ఆధిపత్య పోరులో ఎవరి పక్షాన ఉండాలో తెలియక క్రికెటర్లు తల బాదుకుంటున్నారు.

ఏం జరిగిందంటే..?

రంజీ ట్రోఫీలో తలపడేందుకు ఏ రాష్ట్రానికైనా ఒక జట్టుకే అనుమతి ఉంటుంది. కానీ, శుక్రవారం(జనవరి 5) ముంబైతో తలపడేందుకు రెండు బీహార్ జట్లు మొయిన్-ఉల్-హక్ స్టేడియం చేరుకున్నాయి. అందుకు కారణం.. బీసీఏ అధ్యక్షుడు రాకేష్ తివారీ, సెక్రటరీ అమిత్‌ కుమార్‌ ఎవరికి వారుగా జట్లను ఎంపికచేయడమే.  బీహార్ జట్టును రెండుగా విభజించి వీరిద్దరూ జట్లను ఎంపిక చేశారు. అనంతరం మైదానంలో తమ జట్టే ముంబైతో తలపడుతుందంటూ ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది. 

మైదానానికి ముందుగా చేరుకున్న బీసీఏ అధ్యక్షుడు రాకేష్ తివారీ ఎంపిక చేసిన జట్టును ముంబైతో తలపడేందుకు పోలీసులు అనుమతించారు. దీంతో సెక్రటరీ పక్షాన నిలబడ్డ క్రికెటర్లు ఆడకుండానే వెనక్కి బయలుదేరారు. ఈ కారణంగా బీహార్-ముంబై మ్యాచ్ మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమైంది.

జై షాను అనుసరిస్తున్నా..

తాను ఎంపిక చేసిన జట్టును ఆడించకపోవటంపై బీసీఏ సెక్రటరీ అమిత్‌ కుమార్‌ అసహనం వ్యక్తం చేశారు. దేశ జాతీయ క్రికెట్ జట్టును ఎంపిక చేస్తోంది.. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ కాదని, సెక్రటరీ జై షా అని అమిత్‌ కుమార్‌ వాదించారు. కావాలంటే అందులో ఉన్న సంతకం చెక్ చూసుకోవచ్చని, జై షాదే ఉంటుందని వెల్లడించారు. 

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు 67 ఓవర్ల ఆట జరగ్గా ముంబై 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. బీహార్ బౌలర్లలో వీర్ ప్రతాప్ సింగ్ 4 వికెట్లు పడగొట్టాడు.