పచ్చని చెట్లే పెద్ద పెద్ద బిల్డింగ్ లుగా మారితే!


చెట్లపైన ఇండ్లు కట్టుకోవడం అన్న కాన్సెప్ట్ కొత్త కాదు. ట్రైబల్స్ ఇలాంటివి కట్టుకుని నివసించిన విషయం తెలిసిందే. కానీ అసలు చెట్లే పెద్ద పెద్ద బిల్డింగ్‌‌లుగా మారితే!! వెరైటీగా అనిపిస్తోంది కదా! అయితే ఇది త్వరలోనే నిజం కాబోతోంది. జన్యు మార్పిడి చెట్ల ద్వారా ఇండ్లు, ఆఫీస్ బిల్డింగ్‌‌లు కట్టుకోవచ్చు. ఆ చెట్ల కొమ్మలే రూమ్స్ డివైడ్ చేస్తయ్.. గోడలైతయ్.. టేబుల్స్ అయితయ్.. కుర్చీలైతయ్.. అంతెందుకు అవే కనెక్టింగ్ బ్రిడ్జిలు కూడా అవుతాయని ఉక్రెయిన్ ఆర్కిటెక్ట్ టీమ్ చెబుతోంది. ఇటీవలే జరిగిన ‘ఎకో ఫ్రెండ్లీ ఫ్యూచర్ కన్‌‌స్ట్రక్షన్’ కాంపిటీషన్‌‌లో ఈ టీమ్‌‌ విన్నర్‌‌‌‌గా నిలిచింది.

పోటీలో 500 టీమ్స్

ఎకో ఫ్రెండ్లీ ఫ్యూచర్ కన్‌‌స్ట్రక్షన్స్ ఎలా ఉండాలన్న దానిపై 2006 నుంచి ఏటా ఈవోలో స్కైస్క్రాపర్ కాంపిటీషన్ జరుగుతోంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ఆర్కిటెక్ట్స్ తమ డిజైన్లతో పోటీ పడుతుంటారు. ఈ ఏడాది 500 ఆర్కిటెక్ట్ టీమ్స్ పోటీ పడగా.. ఉక్రెయిన్‌‌కు చెందిన ఆర్కిటెక్ట్స్ టాప్ ప్రైజ్ గెలుచుకున్నారు. ‘లివింగ్ స్కైస్క్రాపర్ ఫర్ న్యూయార్క్ సిటీ’ పేరుతో వాళ్లు రూపొందించిన డిజైన్‌‌కు సుమారు రూ.3.7 లక్షల క్యాష్ ప్రైజ్ పొందారు. 

జన్యు మార్పిడితో ఫాస్ట్‌‌గా పెరుగుతయ్

ప్రకృతికి వీలైనంత తక్కువ డ్యామేజ్‌‌తో ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్స్ నిర్మాణంపై జరిగే ఈ కాంపిటీషన్‌‌లో ఉక్రెయిన్‌‌కు చెందిన గెస్ లైన్ ఆర్కిటెక్ట్స్ టీమ్ జెనిటిక్‌‌ మాడిఫైడ్ చెట్లతో ఇండ్లు, స్కై టవర్స్ లాంటివి కట్టడంపై ప్రెజెటేషన్ ఇచ్చింది. రూమ్స్, గోడలు, ఫర్నీచర్ రూపంలో ఈ చెట్లను చాలా వేగంగా పెంచవచ్చని ఈ ఆర్కిటెక్ట్స్ తెలిపారు. దీనికి సంబంధించిన మోడల్స్‌‌ను పోటీలో ప్రదర్శించారు. ఇప్పటికే వాళ్లు పెంచిన టేబుల్స్, కుర్చీలు, బ్రిడ్జిలను చూపించారు. న్యూయార్క్ సిటీని దృష్టిలో పెట్టుకుని ఈ డిజైన్లు రూపొందించినట్టుగా ఆండ్రీ లెసిక్, మైఖ్యలొ కొహుత్, సోఫియా ష్కొలియర్, కటెరిన ఇవష్‌‌చుక్, నజరి డుడా, మరియా ష్కొలింక్, ఒక్సానాల టీమ్ తెలిపింది.

ఎన్విరాన్‌‌మెంట్ ఫ్రెండ్లీ

జనాభా పెరుగుదలతో చెట్లు నరికేసి.. అపార్ట్‌‌మెంట్లు, ఇతర బిల్డింగ్‌‌లు కట్టడం ఎక్కువైపోయింది. దీంతో చెట్లు తగ్గిపోయి పర్యావరణంపై ఎఫెక్ట్ పడుతోంది. ఈ ఎఫెక్ట్‌‌ను తగ్గించాలన్న లక్ష్యంతోనే తాము ఎన్విరాన్‌‌మెంట్ ఫ్రెండ్లీగా నిర్మాణాలు చేయడంపై డిజైన్లు రూపొందించామని ఉక్రెయిన్ ఆర్కిటెక్ట్స్‌‌ తెలిపారు. బిల్డింగ్ కట్టాలనుకున్న ప్రాంతంలో కొన్ని రకాల పదార్థాలతో సాయిల్ ట్రీట్‌‌మెంట్ చేసి, అవసరమైన స్ట్రక్చర్‌‌‌‌లో కొమ్మలను మలుచుకుని స్ట్రాంగ్‌‌గా ఉండేలా జెనిటిక్ మాడిఫైడ్ చెట్లను పెంచవచ్చని చెప్పారు. ఆ చెట్టు పెరిగే కొద్దీ బిల్డింగ్‌‌లో అవసరమైన షేప్‌‌లలోకి వాటి కొమ్మలను మార్చుకోవచ్చన్నారు. పెద్ద పెద్ద టవర్స్‌‌ కూడా వీటితో కట్టవచ్చని తెలిపారు. ఈ చెట్లు పెంచేందుకు నీళ్లు, ఎరువులు తప్ప దీనికి మరే ఇతర బిల్డింగ్ మెటీరియల్ అవసరం లేదని చెప్పారు. వెదురు, పాలోనియా చెట్లు ఈ తరహా ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్స్‌‌కు బాగా ఉపయోగపడుతాయన్నారు. జన్యు మార్పిడి ద్వారా వీటిని ఫైర్ రెసిస్టెంట్‌‌గా మాత్రమే గాక చెదలు, నీటికి వీక్ అయిపోయికుండా పెంచవచ్చన్నారు. అయితే ఒక భారీ టవర్ కట్టడానికి దాదాపు పదేండ్లపైనే పడుతుందని చెప్పారు.

ఇజ్రాయెల్‌‌కు సెకండ్ ప్లేస్

ఈవోలో స్కైస్క్రాపర్ కాంపిటీషన్‌‌లో ఇజ్రాయెల్ ఆర్కిటెక్ట్స్ టీమ్ రెండో స్థానంలో నిలిచింది. మెక్సికో గ్రౌండ్ వాటర్ లెవల్స్ దారుణంగా పడిపోవడంతో ఆ సిటీని దృష్టిలో పెట్టుకుని తమ డిజైన్లు రూపొందించామని అమిత్ డ్యూచ్, రోనీ డోమినిట్స్, తామర్ కేర్బర్‌‌‌‌ల టీమ్ తెలిపింది. లివియోసో స్కైస్కాపర్ అనే పేరుతో ఈ డిజైన్ రూపొందించారు. స్పానిష్ భాషలో లివియోసో అంటే వర్షం అని అర్థం. బిల్డింగ్ చుట్టూ ఒక భారీ గొడుగును ఓపెన్ చేసి రివర్స్‌‌లో పెట్టినట్టు కనిపించే స్ట్రక్చర్‌‌‌‌ను ఏర్పాటు చేయడం ద్వారా వర్షపు నీటిని భూమిలోకి పంపాలన్నదే ఈ డిజైన్ టార్గెట్ అని ఇజ్రాయెల్ అర్కిటెక్ట్స్‌‌ వివరించారు.