కరోనా బారినపడి మరో ఎమ్మెల్యే కన్నుమూశాడు. ఒడిశాలోని పిపిలి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రదీప్ మహారథి(65) కరోనాతో భువనేశ్వర్‌లోని ఎస్‌యూఎమ్ అల్టిమేట్ మెడికేర్ ఆస్పత్రిలో ఆదివారం తెల్లవారుజామున 2:36కు చనిపోయారు. ఆయనకు సెప్టెంబర్ 14న కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దాంతో ఆయన అప్పటినుంచి అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండటంతో వెంటిలేటర్ మీద ఉంచి వైద్యం అందిస్తున్నారు. కాగా.. శనివారం రాత్రి ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు.
సీనియర్ నాయకుడైన ప్రదీప్ గౌరవార్థం.. ఆయన మృతదేహాన్ని విధానసభకు తరలిస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తల సందర్శనార్థం బీజేడీ కార్యాలయానికి తరలిస్తారు. అక్కడినుంచి పూరి జిల్లాలోని పిపిలిలోని అతని ఇంటికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ప్రదీప్ అంత్యక్రియలు సోమవారం పూరి స్వర్గద్వార్‌లో జరుగుతాయి.
ప్రదీప్ మృతి పట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మరియు పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. ప్రదీప్ పిపిలి నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ప్రదీప్.. 1975లో ఎమర్జెన్సీ సమయంలో మిసా కింద అరెస్టయ్యారు. ఆ తర్వాత ఆయన 1985లో బీజేడీ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అప్పటినుంచి 2019 ఎన్నికల వరకు ఆయనే ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో ప్రదీప్ వ్యవసాయ, పంచాయతీ రాజ్ మరియు మత్స్యశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రభుత్వ చీఫ్ విప్ మరియు డిప్యూటీ చీఫ్ విప్ కూడా పనిచేశారు.
For More News..