హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17న ‘ప్రజాపాలన దినోత్సవం’ పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్నదని, అప్పటికీ అసలు ఎన్నికలే లేవని, అలాంటప్పుడు ప్రజాపాలన ఎలా అవుతుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ‘ప్రజాపాలన దినోత్సవం’ అనే పేరుకు అసలు ఏమైనా అర్థం ఉందా? అని నిలదీశారు. బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక విమోచన దినోత్సవమని, దీన్ని ప్రజా పాలన దినోత్సవంగా ఎలా జరుపుతారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పేర్లు పెట్టినా చరిత్ర మారదని, వాస్తవం ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటకలో విమోచన దినోత్సవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. కానీ, తెలంగాణలో ఎందుకు నిర్వహించడంలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఎంఐఎం నేతలకు భయపడే..
ముస్లిం ఓట్ల కోసం, ఎంఐఎం నేతల భయానికి విమోచన దినోత్సవం నిర్వహించడం లేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. నిజాం కాలంలో హిందువుల మత మార్పిడికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలన్న సూచన సీఎం రేవంత్ కు ఎవరు ఇచ్చారు అని ప్రశ్నించారు. ఒకసారి సీఎం అయినా చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా ఇక్కడ రాలేదని, 1948లో విలీనమనప్పటి నుంచి 1950 వరకు ఎన్నికలే జరగలేదని, ప్రజలు ఓట్లే వేయనప్పుడు ప్రజాపాలన ఎలా అవుతుందని ప్రశ్నించారు.
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తేనే ప్రజలపై కాంగ్రెస్కు నిజమైన ప్రేమ ఉన్నట్లని, లేదంటే ముస్లిం ఓట్లకు భయపడే ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తున్నారని ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. విమోచన దినోత్సవాన్ని ఇంకా స్వేచ్ఛగా నిర్వహించుకోలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహిస్తామని అన్నారు.
రేవంత్ ఇప్పటికైనా కండ్లు తెరవాలన్నారు. దీనిపై ఇప్పటికే రేవంత్ కు లేఖ రాశానని, అలాగే ఆయన్ను కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకలకు హాజరవ్వాలని ఆహ్వానిస్తున్నట్లుగా ఏలేటి చెప్పారు. తెలంగాణను ఆంధ్రాలో కలిపింది నీచమైన కాంగ్రెస్ పార్టీ అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడ్డాక మళ్లీ ముస్లింలకు భయపడి విమోచన వేడుకలను కాంగ్రెస్ నిర్వహించడం లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ స్టీరింగ్ ఎంఐఎం వద్ద ఉందని, రెండు పార్టీలు ఎంఐఎంకు భయపడుతున్నాయన్నారు.