హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సివిల్ సప్లయ్ శాఖలో అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. హెటిరో స్కామ్‌లో కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని, కేబినేట్ నిర్ణయాలు నిరాశపరిచాయన్నారు. రైతు భరోసాపై స్పష్టత లేదని, పింఛన్ పెంపు, ఆరు గ్యారంటీలను పట్టించుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ అవినీతి చర్యలపై దాటివేత ధోరణిని ప్రభుత్వం అవలంబిస్తోందని మండిపడ్డారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్‌ది డూప్ ఫైట్ అని ఎద్దేవా చేశారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లిఫ్ట్ టెండర్లలో గోల్‌మాల్ సంగతేంటని ఆయన ప్రశ్నించారు. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, ప్రజా పోరాటాలతో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.