నిర్మల్, వెలుగు: ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 30న హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద రైతు దీక్ష చేపట్టనునట్లు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. రుణమాఫీ పూర్తి చేయకుండా రైతులను మోసం చేస్తోందన్నారు.
రూ.లక్ష రుణమాఫీకే గత సర్కార్ రూ.19 వేల కోట్లు ఖర్చు చేసిందని, రూ.2 లక్షల రుణమాఫీకి దాదాపు రూ.40వేల కోట్లు ఖర్చవుతాయని రేవంత్ ప్రభుత్వం చెప్పిందని, కానీ ఇప్పటివరకు కేవలం రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసిందన్నారు. సన్న వడ్లకే బోనస్ అనడం రైతులను మోసం చేయడమేనని, బోనస్ భారం తప్పించుకునేందుకే సర్కార్ ప్లాన్ వేస్తోందని ఆరోపించారు.