కేబినెట్‌‌‌‌లో విభేదాలు.. కాంగ్రెస్‌‌‌‌లో కుమ్ములాటలు

కేబినెట్‌‌‌‌లో విభేదాలు.. కాంగ్రెస్‌‌‌‌లో కుమ్ములాటలు
  • సీఎం రేవంత్‌‌‌‌రెడ్డికి రాహుల్‌‌‌‌గాంధీ అపాయింట్‌‌‌‌మెంట్‌‌‌‌ కూడా ఇవ్వట్లేదు
  • బీజేఎల్పీ నేత మహేశ్వర్‌‌‌‌రెడ్డి


నిర్మల్, వెలుగు : రాష్ట్ర కేబినెట్‌‌‌‌లో విభేదాలు, కాంగ్రెస్‌‌‌‌ పార్టీలో కుమ్ములాటలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, వీటిని కట్టడి చేయడంలో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి విఫలం అయ్యారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌‌‌‌రెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. సీఎం తన లోపాలు, వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయంటూ మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు చేస్తున్న ఆరోపణలు ఆయన అవగాహనారాహిత్యానికి నిదర్శనమన్నారు. 

కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం బీజేపీ లేదన్నారు. సీఎంలను మార్చే రికార్ట్‌‌‌‌ ఉన్న కాంగ్రెస్‌‌‌‌ రేవంత్‌‌‌‌రెడ్డిని మార్చి సీనియర్‌‌‌‌ నేతను సీఎం చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తమకు సమాచారముందన్నారు. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధ్య విబేధాలు ఉన్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన విషయంలో సీఎం ఒకరకంగా, డిప్యూటీ సీఎం మరో రకంగా మాట్లాడుతుండడమే వీరి మధ్య విభేదాలు నిదర్శనమన్నారు. రేవంత్‌‌‌‌రెడ్డి తీరుతో కాంగ్రెస్‌‌‌‌ హైకమాండ్‌‌‌‌ అసంతృప్తిగా ఉందని, ఆయన రాహుల్‌‌‌‌ గాంధీ అపాయింట్‌‌‌‌మెంట్‌‌‌‌ కూడా ఇవ్వడం లేదన్నారు. మొదటి నుంచి కాంగ్రెల్‌‌‌‌లో కొనసాగుతూ మంత్రి పదవుల్లో ఉన్ వారు ఒక గ్రూప్‌‌‌‌గా, ఆరుగురు మంత్రులు మరో గ్రూప్‌‌‌‌గా విడిపోయారన్నారు.