
- కొండంత రాగం తీసి.. దిక్కుమాలిన పాట పాడారు
- అధికారం కోల్పోయాక మావోయిస్టులు గుర్తొచ్చారా?
హైదరాబాద్, వెలుగు: ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ నిర్వహించిన సభ అట్టర్ ఫ్లాప్ అయిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విధ్వంసానికి కారణమైన మొదటి వ్యక్తి కేసీఆర్ అని ఫైరయ్యారు. నక్సలైట్లతో చర్చల విషయంలో కేసీఆర్ మాటలు అధికారం కోల్పోయిన తర్వాత వచ్చే మతిస్థిమితం కోల్పోయిన వ్యాఖ్యలేనని ఎద్దేవా చేశారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ స్పీచ్.. కొండంత రాగం తీసి దిక్కుమాలిన పాట పాడినట్టు ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పారు. కేంద్రం నిధులు ఇవ్వలేదని విమర్శలు చేశారని, ఈ అంశంపై కేసీఆర్ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.
అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ కు మావోయిస్టులు గుర్తొచ్చారా.. మావోయిస్టులను వెనకేసుకు రావడం సరైన పద్ధతా’ అని ఏలేటి ప్రశ్నించారు. ఓటు బ్యాంకు కోసమే కేసీఆర్ కు మావోయిస్టులు గుర్తొచ్చారేమోనన్నారు. కేసీఆర్ హాయంలో ఎన్ కౌంటర్లు జరిగలేదా అని ప్రశ్నించారు. మావోయిస్టులను సమర్థించడాన్ని సమాజం ఒప్పుకోదన్నారు. కాళేశ్వరం పేరుతో దోపిడీ జరిగిందని, ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అది ఎత్తిపోతల ప్రాజెక్ట్ కాదని, తిప్పి పోతల ప్రాజెక్ట్ అంటూ విమర్శించారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
కాళేశ్వరం లొకేషన్ మార్పు బ్లెండర్ మిస్టేక్ అని ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెబుతున్నదన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు తోక పార్టీగా పనిచేస్తున్నదని, చెన్నై వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఐదేళ్ల పాటు ప్రశాంతంగా సీఎంగా కొనసాగాలని కేసీఆర్ కోరుకుంటుండడం, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య బంధాన్ని సూచిస్తున్నదన్నారు. బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న 11 శాతం వడ్డీకి అప్పు వెనుక భారీ అవినీతి ఉందని రేవంత్ రెడ్డి అప్పట్లో ఆరోపించారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి దానిపై విచారణ జరపకపోవడం అనుమానాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని అన్నారు.