హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచేందుకే రైతుదీక్ష చేపడుతున్నామని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. ఎన్నికలకు ముందు హామీలిచ్చి రైతులను కాంగ్రెస్ మభ్యపెట్టిందని విమర్శించారు. ఇందిరా పార్కు ధర్నాచౌక్లో ఈ నెల 30న ‘రైతు హామీల సాధన దీక్ష’ కార్యక్రమ స్థలాన్ని ఆయన బీజేపీ నేతలతో కలిసి శుక్రవారం పరిశీలిం చారు. అనంతరం మాట్లాడు తూ..‘‘వరంగల్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ నేతలు రైతులను మోసం చేశారు.
రుణమాఫీ సగం మంది రైతులకు కూడా కాలేదు. పంట బోనస్, రైతు భరోసా వంటి జాడే లేదు. ఈ హామీలన్నీ నెరవేర్చాలనే డిమాండ్ తోనే ఈ నెల 30న 24 గంటల పాటు దీక్ష చేపట్టబోతున్నం’’ అని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం ఆయన మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా ఇండ్లు కూల్చివేసిన భాదితులను పరామర్శించారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కారు హైడ్రామా చేస్తోందని మండిపడ్డారు. పేదల ఇండ్లను, గుడిసెలను కూల్చడం కరెక్ట్ కాదన్నారు.