
- టూర్ కు అని చెప్పి జనాలను తీసుకొచ్చారు
- గాంధీ కుటుంబం ఖర్గేను అవమానించిందని విమర్శలు
వయనాడ్: కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానంఉప ఎన్నికకు నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ తన అఫిడవిట్ లో ఆస్తులను తక్కువగా చూపించారని బీజేపీ ఆరోపించింది. ‘‘ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రాకు ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ రూ.75 కోట్ల డిమాండ్ నోటీసులు పంపించింది. అఫిడవిట్ లో మాత్రం డిమాండ్ నోటీసుల కంటే తక్కువగా ఆస్తులను చూపించారు.
సిమ్లాలోని ఇంటి విలువను కూడా తక్కువగా చూపారు’’ అని బీజేపీ పేర్కొంది. అఫిడవిట్ లో ప్రియాంక తన పేరిట రూ.12 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నట్టు ప్రకటించడంతో బీజేపీ ఈ వ్యాఖ్యలు చేసింది. వయనాడ్ లోక్ సభ స్థానంలో బీజేపీ తరఫున నవ్యా హరిదాస్, ఎల్ డీఎఫ్ తరఫున సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే సత్యన్ మొకెరీ బరిలో నిలిచారు.
గురువారం వీరు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఉప ఎన్నిక నవంబర్ 13న జరగనుంది. కాగా, టూరిస్టు ప్లేస్ లు చూపిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రియాంక నామినేషన్ ర్యాలీకి జనాలను తరలించారని నవ్య విమర్శించారు. ప్రియాంక నామినేషన్ సమయంలో కలెక్టర్ ఆఫీస్ లోకి దళితుడు, కాంగ్రెస్ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గేను తీసుకెళ్లకుండా గాంధీ కుటుంబం అవమానించిందని బీజేపీ నేత గౌరవ్ భాటియా ఆరోపించారు.