
యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్థానిక నాయకులు యాదగిరిగుట్టను కబ్జాలకు నిలయంగా మార్చారని యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ ఆరోపించారు. ఆదివారం యాదగిరిగుట్టలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నయీం హయాంలో ఆయన అనుచరులు వ్యాపారుల నుంచి 'ఎన్' ట్యాక్స్ వసూలు చేసేవారని, ఇప్పుడు యాదగిరిగుట్టలో ఏ చిన్న వ్యాపారం ప్రారంభించాలన్నా కాంగ్రెస్ నాయకులకు 'సీ' టాక్స్ కట్టాల్సి వస్తోందని ఆరోపించారు.
చివరికి రోడ్డు పక్కన మిర్చీ బండి పెట్టుకోవాలన్నా కాంగ్రెస్ నాయకులకు ముడుపులు చెల్లించాల్సిందేనన్నారు. యాదగిరిగుట్టలో కొత్తగా ఏర్పాటవుతున్న ఓ పెట్రోల్ బంక్ ఓనర్ ను ఇద్దరు కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్లు రూ.5 లక్షలు డిమాండ్ చేశారని, ముడుపులు ఇవ్వకపోతే పెట్రోలు బంక్ నడవనివ్వబోమని భయపెడుతున్నారని తెలిపారు. తోపుడు బండి నుంచి మొదలు పెద్ద పెద్ద హోటళ్ల వరకు ప్రతినెలా కాంగ్రెస్ నాయకులకు మామూళ్లు వెళ్తున్నాయని, ఇవ్వకపోతే దుకాణం మూసుకోవాల్సిందేనని స్థానిక చిరువ్యాపారులు బహిరంగంగానే చెప్తున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకులు మామూళ్ల వసూలు, దౌర్జన్యాలు ఆపకపోతే బాధితులతో కలిసి బీజేపీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి భానుచందర్, పట్టణ ఉపాధ్యక్షుడు మల్లేశ్ గౌడ్, బీజేవైఎం అధ్యక్షుడు బుచ్చిబాబు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు నరేశ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజిరెడ్డి పాల్గొన్నారు.