- కమలం ఎంపీ అభ్యర్థిగా గొడం నగేశ్
- మూకుమ్మడిగా బీజేపీని వీడేందుకు సిద్ధమవుతున్న లీడర్లు!
ఆదిలాబాద్, వెలుగు: బీజేపీ రెండో జాబితాలో ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా గొడం నగేశ్‌కు టికెట్ కేటాయించింది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాపురావుకు అధిష్టానం షాక్ ఇవ్వడంతో ఇక ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. పార్టీ సీనియర్లు, టికెట్ ఆశించిన నేతలు మూకుమ్మడిగా పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. టికెట్ కోసం చివరకు తీవ్ర ప్రయత్నాలు చేసిన మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, భైంసా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్ బాబు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్, మరికొందరు లీడర్లు బీజేపీ నుంచి బయటకు రానున్నట్లు సమాచారం.
ఇటు సిట్టింగ్ ఎంపీ సోయం సైతం ఇప్పటికే కాంగ్రెస్ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. ఆ పార్టీ ఎంపీ టికెట్ ను తనకు కేటాయించాలనే హామీ తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఆదిలాబాద్ పార్లమెంట్ సీటును మొదటిసారి గెలిచిన అభ్యర్థికి రెండోసారి టికెట్ కేటాయించకపోవడంతో బీజేపీ వర్గాలు విస్తుపోతున్నాయి.