- నోట్ లో రాత తన కొడుకుది కాదు: భానుప్రసాద్ తల్లి
- విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ భానుప్రసాద్ ఆత్మహత్య వ్యవహారం సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. క్యాంపస్ నుంచి భాను మృతదేహాన్ని ఆదివారం రాత్రి పోలీసులు నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఉదయం సమాచారం తెలుసుకున్న బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు వెళ్లి డెడ్ బాడీని చూస్తామని పట్టుబట్టారు. అయితే పోలీసులు వారిని అడ్డుకొన్నారు.
దీంతో వారికి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఓ దశలో పోలీసులు బలవంతంగా వారిని నెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఆసుపత్రిలోకి దూసుకుపోయారు. పోలీసులు వారిని వెంబడించి బయటకు లాక్కొచ్చి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మ రాజు, రాజేశ్వర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అర్జున్, ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ తదితరులు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మరణించిన విద్యార్థి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు తాము ఆస్పత్రిలోకి వెళ్తామంటే పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. పోలీసుల చర్యను ఖండిస్తున్నామని తెలిపారు. విద్యార్థి మృతిపై అనుమానాలు ఉన్నాయని, ఆ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
నా కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు: భానుప్రసాద్ తల్లి
ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి భానుప్రసాద్ రాసినట్లుగా చెబుతున్న సూసైడ్ నోట్ తన కొడుకు రాసింది కాదని, అందులోని చేతిరాత అతనిది కాదని స్టూడెంట్ తల్లి సునీత పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీకి సోమవారం ఆమె ఫిర్యాదు చేశారు. ‘‘నా కొడుకు ఆత్మహత్య చేసుకునేటంత పిరికివాడు కాదు. చదువులో ఫస్ట్ ఉంటడు. అలాంటిది అతను సూసైడ్ చేసుకున్నాడంటే నమ్మలేకపోతున్నాం. దీనిపై మాకు అనుమానాలు ఉన్నాయి. భానుప్రసాద్ సూసైడ్ నోట్ ను చేతిరాత నిపుణులతో టెస్టు చేయించాలె. అలాగే ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి” అని ఎస్పీకి అందజేసిన వినతిపత్రంలో సునీత కోరారు. భానుప్రసాద్ మృతదేహానికి ఉస్మానియా డాక్టర్లతో పోస్టుమార్టం చేయించాలని ఆమె డిమాండ్ చేశారు.
ముగిసిన అంత్యక్రియలు
ఎల్ బీనగర్, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్య చేసుకున్న పొడిశెట్టి భాను ప్రసాద్ అంత్యక్రియలు అతని స్వగ్రామం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపూర్ అనుబంధ గ్రామం జలాల్ మియా పల్లెలో సోమవారం సాయంత్రం ముగిశాయి. భాను ప్రసాద్ తండ్రి రాములు 10 ఏండ్ల కింద అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి తల్లి సునీత కూలి పనులు చేస్తూ ఇద్దరు పిల్లలను చదివిస్తున్నది. రెండేండ్ల కింద భాను ప్రసాద్‌కు బాసర ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. తమ ఊరి నుంచి బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించాడని ఎంతో సంతోషించామని, కానీ ఇలా శవమై వస్తాడని అనుకోలేదని గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కొడుకు కూడా చనిపోవడంతో తల్లి సునీత, అక్క భార్గవి ఒంటరివారయ్యారు.
ఎవరూ ఆందోళన చెందవద్దు : వీసీ
ట్రిపుల్ ఐటీలో విద్యార్థి భానుప్రసాద్ ఆత్మహత్యపై అనుమానాలు లేవని, వ్యక్తిగత కారణాలతోనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆర్జేయూ కేటీ వైస్ చాన్స్‌లర్ వెంకటరమణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురికావద్దని కోరారు. విద్యార్థులు ఏవైనా సమస్యలుంటే సంబంధిత అధికారులకు లేదా కౌన్సెలర్ల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలలో వాస్తవం లేదన్నారు. కాగా భానుప్రసాద్ రాసినట్లుగా పేర్కొంటున్న సూసైడ్ నోట్ ను పోలీసులు విడుదల చేశారు.