ఎల్లారెడ్డిపేట, వెలుగు: గణేశ్నిమజ్జనం సందర్బంగా ఎల్లారెడ్డిపేటలో 40 మంది యువకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ, హిందూ ఐక్య వేదిక నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పోలీసులు హిందూ కార్యక్రమాలు, హిందూ యువకులపై ఆంక్షలు విధిస్తే భవిష్యత్‌లో మరింత ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఉన్నత అధికారులతో మాట్లాడి యువకులపై ఉన్న కేసులను తొలగిస్తామని సీఐ మొగిలి, ఎస్సై శేఖర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి బుగ్గారెడ్డి, అధికార ప్రతినిధులు దేవేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, లీడర్లు పాల్గొన్నారు.
మాట తప్పిన ఎమ్మెల్యే రాజీనామా చేయాలి
గన్నేరువరం నుంచి గుండ్లపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన అఖిలపక్షం సభ్యులు
గన్నేరువరం, వెలుగు: రాజీవ్ రహదారి గుండ్లపల్లి నుంచి గన్నేరువరం మండల కేంద్రం మీదుగా పోత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పి మాట తప్పిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వెంటనే రాజీనామా చేయాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో మండల కేంద్రం నుంచి రాజీవ్‌రహదారి గుండ్లపల్లి స్టేజీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు కోసం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నోటికి వచ్చిన వాగ్దానాలన్నీ చేశారని, మండలం ఏర్పడిన నాటి నుంచి ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. కార్యక్రమంలో అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, అనిల్, ఉపేందర్‌రెడ్డి, అంజిరెడ్డి పాల్గొన్నారు.
ఈ నెల 30 నుంచి అక్టోబర్ 2 వరకు కళోత్సవాలు
పోస్టర్ ఆవిష్కరణలో మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్‍టౌన్, వెలుగు: సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లాలో కరీంనగర్ కళోత్సవాలు నిర్వహించనున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఆదివారం ప్రతిమ మల్టీప్లెక్స్ లో కళోత్సవాల నిర్వహణపై కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ యాదగిరి సునీల్ రావు, డీసీపీ శ్రీనివాస్ తో కలిసి మంత్రి కమలాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కవులు, కళాకారులకు పురిటిగడ్డ అయిన కరీంనగర్ జిల్లా ఎంతో మంది కవులను ప్రపంచానికి అందించిందని గుర్తు చేశారు. ఉద్యమాలకు కరీంనగర్ జిల్లా వేదిక అని, దేశానికి ప్రధానమంత్రి గా సేవలందించిన పీవీ నరసింహారావు, ప్రముఖ కవి, సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి.నారాయణ రెడ్డి, జానపద బ్రహ్మ మిద్దెరాములు.. తదితర ప్రముఖులకు పుట్టినిల్లు కరీంనగర్ జిల్లా అని పేర్కొన్నారు. జిల్లా ప్రాముఖ్యం, గొప్పదనాన్ని చాటేందుకు కరీంనగర్ కాళోత్సవాలను బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. తారా ఆర్ట్స్ అకాడమీ ఇంటర్నేషనల్ ఫోక్ అకాడమీ సారథ్యంలో కరీంనగర్ చరిత్రలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ భారతీయ సంప్రదాయ, సాంస్కృతిక కళోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని 28 (కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు) రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన కళాకారులు, మలేషియా, మారిషస్, సింగపూర్, ఇజ్రాయిల్ దేశాలకు చెందిన కళాకారులు ప్రదర్శనలు ఇస్తారని వివరించారు. ఇతర రాష్ట్రాలకు, దేశాలకు చెందిన 30 బృందాలు, కరీంనగర్ జిల్లాలోని 30 బృందాలు ఉత్సవాల్లో పాల్గొంటాయన్నారు. ఈ ఉత్సవాలను మంత్రి కేటీఆర్ప్రారంభిస్తారని, ముగింపు ఉత్సవాల్లో సినీనటుడు మెగాస్టార్చిరంజీవి హాజరుకానున్నట్లు మంత్రి గంగుల చెప్పారు. అనంతరం కళోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
రవీందర్ సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి
ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ను కోరిన కార్పొరేటర్లు
కరీంనగర్ కార్పొరేషన్, వెలుగు: కరీంనగర్మాజీ మేయర్ రవీందర్ సింగ్ తోపాటు అతని అల్లుడు సోహన్ సింగ్, కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ లను పార్టీనుంచి సస్పెండ్ చేయాలని టీఆర్ఎస్ కార్పొరేటర్లు కోరారు. ఆదివారం హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ బోయినిపల్లి వినోద్ కుమార్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు నమ్మినవాడుగా ఉంటూ.. కరీంనగర్ లో మాత్రం మంత్రి గంగుల కమలాకర్ తో పాటు మేయర్ సునీల్ రావుపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఇప్పటివరకు 350 ఫిర్యాదులు చేసి, స్మార్ట్ సిటీ పనులను అడ్డుకోవడమే కాకుండా సమస్యలు సృష్టిస్తూ.. మంత్రి గంగులకు నిద్రపట్టకుండా చేస్తున్నామని చెప్పిన ఆడియో వైరల్ అయిన విషయం తెలిసిందేనన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు వాల రమణారావు, ఐలేందర్ యాదవ్, దిండిగాల మహేశ్, భూమాగౌడ్, నాయకులు చల్లహరిశంకర్, మెండి చంద్రశేఖర్, ఎడ్ల అశోక్,గుగ్గిళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
గంగాధర, వెలుగు : కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్‌రావు అన్నారు. చొప్పదండి నియోజకవర్గ సమావేశాన్ని ఆదివారం గంగాధర మండలం మధురానగర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే రవిశంకర్ పనితీరుతో నియోజకవర్గ ప్రజలు విసిగిపోయి ఉన్నారన్నారు. పార్టీ శ్రేణులు అందరూ సమష్టిగా పనిచేస్తే ఇక్కడ కాషాయ జెండా ఎగురు తీరుతుందన్నారు. అనంతరం ప్రవీణ్‌రావును నాయకులు ఘనంగా సన్మానించా
రు. కార్యక్రమంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెరుక శ్రవణ్‌కుమార్, మండలాల అధ్యక్షులు అశోక్, రవీందర్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు మనోహర్, నాయకులు గౌతంకృష్ణ, వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.
విమోచనమే తెలంగాణకు అసలైన స్వాతంత్రం
కరీంనగర్, వెలుగు: నిజాం నిరంకుశ పాలనకు చరమ గీతం పాడి స్వేచ్ఛ స్వాతంత్రాలను పొందిన సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు ముమ్మాటికీ విమోచన దినమేనని, అదే నిజమైన స్వాతంత్ర దినోత్సవమని నైజాం విముక్త స్వాతంత్ర్య అమృత్యోత్సవాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాపురావు తెలిపారు. ఆదివారం కరీంనగర్‌లోని భగత్ నగర్ లో నైజాం విముక్త స్వాతంత్ర అమృత్యోత్సవాల సమితి సమావేశం జరిగింది. కార్యక్రమంలో ఉత్సవ సమితి కరీంనగర్ జిల్లా గౌరవ అధ్యక్షులు భాగ్యరెడ్డి, అధ్యక్షులు ఇ.మధుసూదన్ రావు పాల్గొన్నారు.
విద్యార్థులు ఇష్టపడి చదవాలి
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
తిమ్మాపూర్, వెలుగు: కష్టపడి కాకుండా ఇష్టపడుతూ చదువుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర సాంస్కృతిక చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. మండలంలోని రామకృష్ణ కాలనీలో గల బీసీ బాలుర రెసిడెన్షియల్ హాస్టల్ ను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. వంట గదిని పరిశీలించి మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల కోసం తయారు చేసిన జావను తాగారు. అనంతరం హాస్టల్ రూమ్‌లు, పరిసరాలను పరిశీలించారు.
మెగా హెల్త్ క్యాంప్
తిమ్మాపూర్మండలం మొగిలి పాలెంలో ఏషియన్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సహకారంతో ఉచిత మెగా హెల్త్ క్యాంపు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ కలలుగన్న ఆరోగ్య తెలంగాణలో భాగంగా ఏషియన్ హాస్పిటల్ ముందుకు వచ్చి ఉచితంగా వైద్యంతోపాటు మెడిసిన్ కూడా అందించడం గొప్ప విషయమన్నారు.
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
సిరిసిల్ల టౌన్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 9వ రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లా యోగాసన కీడా పోటీలు ఆదివారం తెలంగాణ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, టీఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ తోట ఆగయ్య హాజరయ్యారు. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర యోగా అసోసియేషన్సెక్రటరీ మనోజ్, అసోసియేషన్ గురువు శ్రీనివాస్ , ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
కరెంట్‌షాక్‌తో యువకుడు మృతి
జగిత్యాల, వెలుగు:గణేశ్ నిమజ్జన ఉత్సవాల్లో కరెంట్ షాక్ కొట్టి యువకుడు చనిపోయాడు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మరిపల్లికి చెందిన కొరకొండ రాజు(22) ఆదివారం గణపతి నిమజ్జనం ఊరేగింపులో కరెంట్బల్బ్ ను కట్టెతో జరిపే క్రమంలో కరెంట్‌షాక్ కొట్టి కుప్పకూలాడు. స్థానికులు జగిత్యాల జిల్లా హాస్పిటల్‌కు తరలించగా పరీక్షించిన వైద్యులు రాజు చనిపోయినట్లు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం
కొత్తపల్లి, వెలుగు: ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని డీసీసీ మహిళా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి అన్నారు. కొత్తపల్లి మండల నాయకులతో చింతకుంటలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్లు, వితంతు, బీడీ పింఛన్లు, పావలా వడ్డీ రుణాలు అర్హులకు అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకుడు మేనేని రోహిత్‌రావు, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మురళి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రహమత్ హుస్సేన్, మండల మహిళా అధ్యక్షురాలు సుజాత, నాయకులు పాల్గొన్నారు.
స్క్రాప్ దొంగిలించేందుకు వెళ్లి..చెరువులో పడి వ్యక్తి మృతి
వేములవాడ, వెలుగు : నిమజ్జనం తర్వాత గణేశ్ విగ్రహాల స్క్రాప్ దొంగిలించేందుకు వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో పడి చనిపోయాడు. వేములవాడలోని రాజన్న గుడి చెరువులో గణేశ్విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఆదివారం విగ్రహాల స్క్రాప్ దొంగిలించేందుకు పట్టణంలోని శివ పార్వతుల కాలనీకి చెందిన నాగరాజు(25) మరికొందరితో కలిసి చెరువులోకి దిగి అందులో జారీ పడి చనిపోయాడు. ఇప్పటికే నాగరాజుపై దొంగతనం కేసులున్నాయని, స్క్రాప్ దొంగిలించేందుకు వెళ్లి చనిపోయినట్లు టౌన్ సీఐ వెంకటేశ్‌తెలిపారు.
నాబార్డు సహకారంతో గోదాముల నిర్మాణం
కొడిమ్యాల, వెలుగు: నాబార్డు నిధులు రూ.38 లక్షలతో కొడిమ్యాల మండలం పూడూరు పీఎసీఎస్ పరిధిలో గోదాములను నిర్మిస్తున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తెలిపారు. ప్యాక్స్ చైర్మన్ బండ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు బండ నర్సింహారెడ్డి, కడారి మల్లేశం, నాగభూషణం రెడ్డి, సర్పంచ్ పెద్ది కవిత, నాయకులు కృష్ణా రావు, పోలు రాజేందర్, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
'ఖని' కరస్పాండెంట్లకు గురుబ్రహ్మ అవార్డులు
గోదావరిఖని, వెలుగు: నేషనల్ ఎస్‌ఈఎంఎస్ ఒలంపియాడ్ ఆధ్వర్యంలో టీచర్స్ డే సందర్భంగా కోల్ బెల్ట్ పారిశ్రామిక ప్రాంత కరస్పాండెంట్లు అధర్‌సండే సమ్మారావు, బందారపు యాదగిరి గౌడ్, నోయల్ ఆశాలత జోసెఫ్‌లకు నేషనల్గురుబ్రహ్మ అవార్డులను అందజేశారు. ఆదివారం హైదరాబాద్ బోడుప్పల్ అకాడమిక్ హైట్స్ స్కూల్లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్ లక్ష్మి శోభన్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకున్నారు. కార్యక్రమంలో ఒలంపియాడ్ నిర్వాహకులు రామచంద్ర రెడ్డి, పాపిరెడ్డి, ఎస్‌ఎన్ రెడ్డి, ట్రస్మా అధ్యక్షులు యాదగిరి గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.