- అందుకే బీజేపీతో కేటీఆర్, హరీశ్ చర్చలు
- విప్ ఆది శ్రీనివాస్ కామెంట్
హైదరాబాద్, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్ నేతలు రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారని, కవిత బెయిల్ కోసం బీజేపీకి బీఆర్ఎస్ నేతలు స్నేహహస్తం అందిస్తున్నారని విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు.
ఇందులో భాగంగా కేటీఆర్, హరీశ్ రావు బీజేపీతో చర్చలు జరుపుతున్నారని సోమవారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ‘‘ఇప్పటి దాకా హరీశ్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఇపుడు ప్రజానేత అని పొగుడుతున్నారు. అంటే ఆ పార్టీల నేతల మధ్య చీకటి ఒప్పందం ఉందన్నది స్పష్టం అవుతున్నది. హరీశ్ పొగడ్తలతో ముంచెత్తడం వెనుక ఆయనతో రాజీనామా చేయించి బీజేపీ తరపున పోటీచేయించే ఆలోచన ఉన్నట్లు కనిపిస్తోంది.
ALSO READ : వచ్చే నెల 15లోగా రుణమాఫీ చేస్తం : ఉత్తమ్
అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా సిద్దిపేటలో హరీశ్ మళ్లీ గెలుస్తాడని బండి సంజయ్ అంటున్నారు. కేసీఆర్ పై ఒత్తిడి తెచ్చి బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. విలీనానికి కేసీఆర్ ఒప్పుకోకపోతే హరీశ్ రావును అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ ను చీల్చే అవకాశాలున్నాయని, మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే ప్రయోగాన్ని తెలంగాణలో కూడా చేస్తారన్న అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను దెబ్బతీయడానికే రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటైనా కాంగ్రెస్ కు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.