- సన్నిహితుల కోసం సింగరేణి ప్రయోజనాలను కేసీఆర్ బలిపెట్టిండు
- నాడు వేలంలో సంస్థను ఎందుకు పాల్గొననియ్యలే?
- అరబిందోకు కోయగూడెం బ్లాక్, ప్రతిమకు సత్తుపల్లి బ్లాక్ అప్పజెప్పిండు
- పదేండ్లలో సింగరేణిని నాశనం చేసిండు
- -కుట్రలను నిరూపించేందుకు రెడీ
- కిషన్‌రెడ్డికి తెలంగాణపై ప్రేమ ఉంటే శ్రావణపల్లితో పాటు కోయగూడెం, సత్తుపల్లి బ్లాకులూ సింగరేణికి ఇవ్వాలి
- గోదావరి తీరంలోని గనులన్నీ సంస్థకే కేటాయించాలని ప్రధానిని కలుస్తం
- అఖిలపక్షంతో మోదీ దగ్గరకు వెళ్తామని వెల్లడి
ఖమ్మం, వెలుగు: బొగ్గు గనులు సింగరేణి సంస్థకు దక్క కుండా బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు పన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. కోల్‌బ్లాక్‌లను కేంద్ర ప్రభుత్వం వేలం వేసి ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే.. సన్నిహితుల కోసం సింగరేణి ప్రయోజనాలను కేసీఆర్ బలిపెట్టారని ఆయన అన్నారు. ‘‘లిక్కర్ స్కామ్‌లో ఉన్న అరబిందో కంపెనీకి చెందిన ‘ఆరో మైనింగ్’కు కోయగూడెం ఓపెన్ కాస్ట్.. ప్రతిమ గ్రూప్‌కు చెందిన ‘శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్’కు సత్తుపల్లి మూడో బ్లాక్ దక్కేలా నాడు కేసీఆర్ పరోక్షంగా సహకరించిండు. కేంద్రం నిర్వహించిన వేలం పాటల్లో సింగరేణిని పాల్గొనకుండా చేసిండు” అని ఫైర్ అయ్యారు.
ఆధారాలతో కేసీఆర్కుట్రలను నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణపై ఏ మాత్రం ప్రేమ, చిత్తశుద్ధి ఉన్నా.. రాష్ట్రంలోని శ్రావణపల్లి బ్లాక్ ను సింగరేణికి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.
కేంద్రం చట్టం తెస్తే బీఆర్ఎస్ మద్దతిచ్చింది
మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్ మెంట్ అండ్ రెగ్యులేషన్) 1957 చట్టానికి 2015 ఫిబ్రవరిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవరణ చేస్తూ, బొగ్గు గనులను వేలం వేసే విధానాన్ని తీసుకువచ్చిందని, దీన్ని నాడు బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు అడ్డుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ‘‘చట్టాన్ని చేసింది బీజేపీ అయితే.. దానికి అప్పుడు మద్దతు పలికిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నరు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేండ్లలో గనుల వేలంలో సింగరేణి పాల్గొనకుండా కుట్రపూరితంగా అడ్డుకున్నది కేసీఆర్ కదా? 2021 అక్టోబర్ 29న సింగరేణి బోర్డు సమావేశమై బొగ్గు గనుల వేలంలో పాల్గొనాలని నిర్ణయం తీసుకుంటే.. 2021 నవంబర్ 5న కోర్ కమిటీ సమావేశమై అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలతో గోదావరి తీరంలోని బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొనొద్దని డిసైడ్అయ్యారు. కేసీఆర్ కుట్ర కారణంగా వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనకపోవడంతో కోయగూడెంను ‘ఆరో మైనింగ్’ కంపెనీ, సత్తుపల్లి బ్లాక్ ను ‘ప్రతిమ గ్రూపు’కు చెందిన కంపెనీ దక్కించుకున్నాయి” అని పేర్కొన్నారు. రాష్ట్రంలో గనుల వేలంలో సింగరేణిని పాల్గొనవద్దని చెప్పిన కేసీఆర్.. ఆ తర్వాత ఒడిశాలోని బంపీ బ్లాక్ వేలంలో పాల్గొనాలని అధికారులను పంపారని మండిపడ్డారు. పదేండ్లు సింగరేణిని సర్వనాశనం చేసి, ఇప్పుడు దొంగే దొంగ అని అరిచినట్టుగా బీఆర్ఎస్ వ్యవహారం ఉందని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్ గానీ ఇంకెవరైనాగానీ, ఈ అంశంపై మాట్లాడడానికి వస్తే ఆధారాలతో వాళ్ల కుట్రలను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే జనం తాటతీస్తారని ఆయన హెచ్చరించారు.
ఆ రెండు బ్లాకులను కూడా కేటాయించాలి
రాష్ట్రంలో 40 చోట్ల సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేస్తు న్నదని, ఇందులో 2032 నాటికి 22 బొగ్గు గనులు మూతపడ్తాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అప్పుడు కూడా బొగ్గు ఉత్పత్తి సజావుగా జరగాలన్నా, సింగరేణి సంస్థ కేవలం చరిత్రగా మిగిలిపోకుండా ఉండాలన్నా కొత్త గనులు కావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ‘‘సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి 51శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నందున వేలంతో సంబంధం లేకుండా బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి తెలంగాణపై ఏ మాత్రం ప్రేమ, చిత్తశుద్ధి ఉన్నా గనుల శాఖ మంత్రిగా ఒడిశాలోని నైనీ బ్లాక్ తరహాలోనే రాష్ట్రంలోని శ్రావణపల్లి బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాలి” అని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈఏడాది మార్చిలో అప్పటి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి ఇదే విషయంపై ప్రభుత్వం తరఫున లేఖను ఇచ్చామని భట్టి తెలిపారు.
ఇప్పుడు కూడా రాష్ట్రంలోని అన్ని పార్టీల ప్రతినిధులను వెంటబెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసేందుకు సిద్ధమని చెప్పారు. ఈ అంశంపై బీఆర్ఎస్ కూడా ముందుకు రావాలని ఆయన కోరారు. ఇక అలాట్ చేసిన టైమ్ దాటిపోవడంతో కోయగూడెం బ్లాక్ లీజును ఆరో మైనింగ్ కంపెనీ, సత్తుపల్లి మూడో బ్లాక్ లీజును అవంతిక కాంట్రాక్టర్స్ కంపెనీలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఈ రెండు కంపెనీలు వేసిన బిడ్ కంటే 0.5 శాతం అదనంగా చెల్లించి గనులను తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, స్విస్ చాలెంజ్ పద్ధతిలో వాటిని సింగరేణికి అప్పగించాలని భట్టి అన్నారు. భవిష్యత్‌లో కూడా గోదావరి తీరంలోని గనులన్నీ సింగరేణికి కేటాయించేలా ప్రధాని నరేంద్రమోదీని ఒప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చే అఖిలపక్షానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమయం ఇప్పించాలని కోరతామని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, అఖిలపక్ష ప్రతినిధులమంతా ఢిల్లీకి వెళ్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, ఎలాంటి భేషజాలకు పోబోమని స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన మనిషిగా కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం చొరవ తీసుకోవాలని ఆయన అన్నారు. సత్తుపల్లి, కోయగూడెంతో పాటు శ్రావణపల్లి బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాలని కోరారు.
సంస్థను కాపాడుకుందాం: తుమ్మల
రాష్ట్రంలో వెలుగులు నింపిన సంస్థగా సింగరేణి సంస్థను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 2016 ఒడిశాలోని నైనీ బ్లాక్‌ను ఎటువంటి వేలంపాట లేకుండా సింగరేణికి కేటాయించారని, అలాగే తెలంగాణలోని గనులను కూడా సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. వేలం వేసి ప్రైవేట్ సంస్థలకు గనులు కేటాయించా లన్న కేంద్ర ప్రభుత్వ కుట్రలను, వ్యవహార శైలిని ఖండిస్తున్నా మన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే లు కూనంనేని సాంబశివరావు, మట్టా రాగమయి, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ పాల్గొన్నారు.
సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నందున వేలంతో సంబంధం లేకుండా బొగ్గు గనులను ఆ సంస్థకే అప్పగించాలి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి తెలంగాణపై ఏ మాత్రం ప్రేమ, చిత్తశుద్ధి ఉన్నా గనుల శాఖ మంత్రిగా ఒడిశాలోని నైనీ బ్లాక్ తరహాలోనే రాష్ట్రంలోని శ్రావణపల్లి బ్లాక్‌ను సింగరేణికి ఇవ్వాలి.
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క