సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. అల్లు అర్జున్కు బీజేపీ, బీఆర్ఎస్ సపోర్ట్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. అల్లు అర్జున్కు బీజేపీ, బీఆర్ఎస్ సపోర్ట్
  • తొక్కిసలాట ఘటన జరిగిన నాటి నుంచి ఇరు పార్టీల నేతల మద్దతు
  • సినీ హీరో అరెస్ట్​ టైమ్​లో మద్దతుగా వ్యాఖ్యలు, ట్వీట్లు
  • సీఎం పేరు మరిచిపోతే అరెస్ట్​ చేస్తారా అని కేటీఆర్ ​కామెంట్​
  • ఒక్కరినే అరెస్ట్​ చేస్తరా?.. అని ప్రశ్నించిన బీజేపీ ఎంపీ పురందేశ్వరి
  • రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్​ ట్వీట్​
  • ఓ మహిళ ప్రాణం పోయినా హీరోకు సపోర్ట్ చేస్తారా? అని నెటిజన్ల నిలదీత

హైదరాబాద్ ,వెలుగు: సంధ్య థియేటర్​ తొక్కిసలాట ఘటనలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు, ఆ పార్టీల నేతలు ఆది నుంచీ అల్లు అర్జున్​కే సపోర్ట్​ చేస్తున్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్​ను పోలీసులు అరెస్ట్​ చేసినప్పుడు రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్.. పుష్ప హీరోకే మద్దతు ప్రకటించారు. నేషనల్ అవార్డు వచ్చిన హీరోపై రాష్ట్ర సర్కారు కక్ష కట్టిందని బీజేపీ నేతలు, కేవలం సీఎం పేరు మర్చిపోయినందుకే ఇలా చేస్తున్నదని బీఆర్ఎస్​ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

బీజేపీ రాష్ట్ర నేతలతోపాటు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, బీజేపీ ఎంపీ, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్, ప్రముఖ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సైతం అల్లు అర్జున్​కు సపోర్ట్​గా ట్వీట్స్​ పెట్టడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అల్లు అర్జున్కు తాను బిగ్ సపోర్ట్ అని, ఆయన అరెస్ట్ అవడం దురదృష్టకరమని కంగనా రనౌత్​ ట్వీట్​ చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. 

 సినిమా ఇండస్ట్రీపై కాంగ్రెస్ కు గౌరవం లేదు:  రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

సినిమా ఇండస్ట్రీపై కాంగ్రెస్​కు గౌరవం లేదని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్​ ట్వీట్​ చేశారు.‘‘సినిమా ఇండస్ట్రీ, నటీనటుల పట్ల కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదు. హీరో అల్లు అర్జున్ అరెస్ట్​తో ఇది మరోసారి నిరూపితమైంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, స్థానిక అధికారుల నిర్లక్ష్యం ఫలితంగానే సంధ్య థియేటర్‌‌ వద్ద తొక్కిసలాట జరిగింది. ఇప్పుడు ఈ తప్పును ఇతరులపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారు. తొక్కిసలాట ఘటన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. అలాగే, ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. వీటిని వదిలేసి నిత్యం సినీ నటీనటులపై విరుచుకుపడడం తగదు. గత ఏడాది నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది’’ అంటూ ట్విట్టర్ వేదికగా రేవంత్ సర్కారుపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్  మండిపడ్డారు.

సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ‘‘అరెస్టెడ్’’
సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్‍ ఎక్స్ (ట్విట్టర్)లో మళ్లీ ‘అల్లు అర్జున్ అరెస్టెడ్’ (#AlluArjunArrested) అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్​ అవుతున్నది. రేవంత్ రెడ్డి కామెంట్లు, అల్లు అర్జున్ వివరణ తర్వాత సోషల్ మీడియాలో తొక్కిసలాట ఘటనపై మళ్లీ జోరుగా చర్చ సాగుతున్నది. చాలా మంది నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తున్నారు. అల్లు అర్జున్‍కు మద్దతు తెలుపుతూ కొందరు, ఆయనను వ్యతిరేకిస్తూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలను సపోర్ట్​ చేస్తూ కొందరు ట్వీట్లు చేస్తున్నారు. ‘‘పోలీసులు చెప్పినా అల్లు అర్జున్​ థియేటర్ నుంచి ముందుగా బయటకు పోలేదని, వెళ్లిన తర్వాత కూడా ర్యాలీ చేశారని, అందుకే తొక్కిసలాట జరిగిందని రేవంత్ చేసిన వ్యాఖ్యలను చాలామంది సపోర్ట్​ చేశారు.

సోషల్ మీడియాలో దాదాపు సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టుగా పోస్టులు కనిపిస్తున్నాయి.  అదే సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ తీరుపై నెటిజన్లు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళా  అభిమాని ప్రాణాలు కోల్పోవడం, ఆమె కుమారుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతుంటే  వారికి మద్దతు తెలుపకుండా రాజకీయాల కోసం ఇలాంటి ప్రకటనలు ఏంటని బీఆర్ఎస్, బీజేపీ లీడర్లపై నెటిజన్లు మండిపడుతున్నారు. రైల్వే ప్రమాదాలు, ప్రయాణికుల సమస్యలు పట్టించుకోకుండా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఓ హీరోకు మద్దతు తెలపడం ఏంటని ఫైర్​ అవుతున్నారు.

పేరు మర్చిపోతే అరెస్ట్ చేస్తరా?: కేటీఆర్ 
బీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ అడుగు ముందుకేసి ఈ ఘటనలో సీఎం రేవంత్​పై తీవ్ర విమర్శుల చేశారు.  సీఎం పేరు మర్చిపోతే హీరోలను అరెస్ట్ లు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. “ సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ తప్పేంటి? సీఎం పేరు మరిచిపోవడమే ఆయన చేసిన తప్పా. సీఎం పేరు మరిచిపోయినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా? అని కేటీఆర్​వ్యాఖ్యానించారు. 

ఒక్కరినే అరెస్ట్ చేస్తరా?: బీజేపీ ఎంపీ  పురందేశ్వరి 
ఓ హీరోగా అల్లు అర్జున్​ థియేటర్‌‌లో తన సినిమా చూసేందుకు వెళ్లారని, అప్పుడు జరిగిన ప్రమాదం ఆయన ప్రేరేపించింది కాదని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆమె ప్రకాశంలో మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో మిగిలిన వారిని అరెస్టు చేయకుండా ఏ11గా ఉన్న అల్లు అర్జున్‌‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదని అన్నారు.