సిరిసిల్లలో బీజేపీ, బీఆర్ఎస్​ వార్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న చందంగా పరిస్థితి మారింది. పేపర్ లీక్ కేసులో ఐటీ మంత్రి కేటీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ స్టేట్ చీఫ్​బండి సంజయ్​చిత్రపటానికి రెండు రోజుల క్రితం బీఆర్​ఎస్ యూత్ నాయకులు సిరిసిల్ల పట్టణ కేంద్రంలో గుట్కా ప్యాకెట్లతో అభిషేకం చేశారు. దీన్ని నిరసిస్తూ మరుసటి రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండలాధ్యక్షుడు కస్తూరి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మందు బాటిళ్లతో సారాభిషేకం చేశారు. ఈ విషయమై పోలీసులు కస్తూరి కార్తీక్ రెడ్డి,పెంజర్ల కళ్యాణ్  పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. బీజేపీ నాయకుల రిమాండ్ ను నిరసిస్తూ సిరిసిల్ల బీజేపీ నాయకులు ఎస్పీ ఆఫీస్ ను ముట్టడించారు. ఆందోళనకు దిగిన 16 మంది బీజేపీ నాయకులను అరెస్ట్​ చేసి సాయంత్రం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. బీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్​ఫోటోకు గుట్కా ప్యాకెట్లతో అభిషేకం చేశారని, మరి వారిపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయడం లేదని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి ప్రశ్నించారు.

ఏబీవీపీ నాయకులు రిమాండ్ 

రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఇద్దరు ఏబీవీపీ నాయకులను పోలీసులు శనివారం రిమాండ్ కు తరలించారు. తంగళ్లపల్లి మండలం శుభోదయ స్కూల్ లో 5వ తరగతి చదువుతున్న స్టూడెంట్​బస్సు ఫీజు కట్టలేదని ఆమెను నడిరోడ్డుపై వదిలేశారు. దీనిని నిరసిస్తూ ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ రంజిత్ కుమార్ శుభోదయ స్కూల్​ను శనివారం ముట్టడించారు. ఈ సందర్భంగా స్కూల్ యజమాన్యం, ఏబీవీపీ స్టూడెంట్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఏబీవీపీ నాయకులు స్కూల్​ఫర్నిచర్​ధ్వంసం చేశారు. దీంతో మారవేణి రంజిత్ కుమార్, నాగరాజుపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.