కేజ్రీవాల్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి. కేవలం 7 మంది ఎంపీలతో కూడిన చిన్న రాష్ట్రం ఢిల్లీ. అయినప్పటికీ కేజ్రీవాల్ భారత రాజకీయాల్లో ఒక దిగ్గజంలా కనిపిస్తున్నారు. ఫిబ్రవరి 8, 2025న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావాన్ని చూపుతాయి. దీనికి కేజ్రీవాల్ రాజకీయ వ్యక్తిత్వమే కారణం. కేజ్రీవాల్ రాజకీయాలకు కొత్త ఆలోచనలను తీసుకువచ్చినందున చాలా రాజకీయ పార్టీలు కేజ్రీవాల్ రాజకీయాలకు భయపడుతున్నాయి.
కేజ్రీవాల్ 2013 నుంచి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేలలో 90% మంది రాజకీయాలకు కొత్తగా వచ్చినవారు, చాలామంది హంబుల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినవారు. కేజ్రీవాల్ వ్యవస్థ భారతదేశం మొత్తం వ్యాపిస్తే 1947 నుంచి వ్యవస్థలను పక్కదారి పట్టిస్తున్న రాజకీయ నాయకులందరూ రాజకీయాలకు దూరమవుతారు. వంశపారంపర్య రాజకీయ పార్టీలు చాలా నష్టపోతాయి. వృత్తిపరమైన రాజకీయ నాయకులు ప్రజల బహిష్కరణకు గురవుతారు.
అర్వింద్ కేజ్రీవాల్ మహాత్మా గాంధీ కాదు. అయితే, కేజ్రీవాల్ భారత రాజకీయాల్లో సంచలనాలు సృష్టించే వ్యూహాత్మక రాజకీయ నాయకుడు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీల వ్యవస్థను మాత్రమే కోరుకుంటున్నాయి. కాబట్టి, ఆ రెండు పార్టీలే రాజకీయాల్లో ఎక్కువగా లాభం పొందుతున్నాయి.60 సంవత్సరాలుగా కాంగ్రెస్, బీజేపీ.. ఈ రెండు పార్టీలు ఢిల్లీ రాజకీయాలలో ఆధిపత్యం చలాయించేవి. కేజ్రీవాల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో కాంగ్రెస్ పార్టీని ఢిల్లీలో తుడిచిపెట్టేశాడు. మరోవైపు 2013 నుంచి బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నాడు.
కేజ్రీవాల్ రాకతో బీజేపీ, కాంగ్రెస్ ఒకటేనని ఢిల్లీ ప్రజలు భావిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీల నుంచి ఢిల్లీలో స్థానికంగా వ్యక్తిగతంగా ప్రజలను ప్రభావితం చేసే రాజకీయ ప్రాబల్యం ఉన్న నాయకుడు ఎదగలేదు. ఢిల్లీకి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తమ హైకమాండ్ చుట్టూ పరిగెత్తాల్సి వచ్చింది. పార్టీ అధిష్టానాన్ని సంప్రదించకుండా ఏ ఒక్క నాయకుడు సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేకపోవడంతో ఆ రెండు పార్టీలనుంచి బలమైన నాయకుడిగా ఏ ఒక్కరూ ఎదగలేదు. ఢిల్లీలో కాంగ్రెస్ లేదా బీజేపీకి పెద్ద నాయకుడు లేడు. ఈ పరిణామం కేజ్రీవాల్‌కు అతిపెద్ద ప్రయోజనకరంగా మారింది.
రెండు పార్టీలకూ కేజ్రీవాల్ భయం
కాంగ్రెస్, బీజేపీ ఈ రెండు పార్టీలు కేజ్రీవాల్‌కు భయపడుతున్నాయి. ఆయన ఎప్పుడూ ఆ పార్టీల రాజకీయాల పట్ల భయపడలేదు. బీజేపీ, కాంగ్రెస్ రాజకీయాలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. భారత చరిత్రలో ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి ఢిల్లీ, పంజాబ్ మాదిరిగా రెండు వేర్వేరు రాష్ట్రాలను గెలుచుకున్న ఏకైక పార్టీ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ. కాగా, భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో విజయాలు సాధించలేదు.
కేజ్రీవాల్ అండ్ కాంగ్రెస్
కేజ్రీవాల్ ఎప్పుడూ కాంగ్రెస్‌ను వ్యతిరేకించేవారు. కానీ, రాజకీయ ఒత్తిడి కారణంగా కేజ్రీవాల్ 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. కేజ్రీవాల్ ఇప్పుడు కాంగ్రెస్‌ను ఇండియా అలయన్స్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 8న కేజ్రీవాల్ ఢిల్లీలో గెలిస్తే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వెంటనే ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టిస్తాడు.
కేజ్రీవాల్ పార్టీ మరోసారి ఢిల్లీలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే.. ఇండియా అలయన్స్ నాయకత్వాన్ని కాంగ్రెస్ వదులుకోవలసిన అవకాశాలు పెరుగుతాయి. అందుకే, కేజ్రీవాల్ ఢిల్లీని గెలవకుండా నిలువరించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. బీజేపీ కంటే రాహుల్ గాంధీకి కేజ్రీవాల్ రాజకీయంగా పెద్ద శత్రువుగా మారే అవకాశం ఉంది.
కేజ్రీవాల్ అండ్ బీజేపీ
1998 నుంచి వరుసగా ఆరుసార్లు జరిగిన ఢిల్లీ రాష్ట్ర ఎన్నికలలో బీజేపీ ఓటమిపాలైంది. జూన్ 2024 పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ సాధించి ఒంటరిగా
ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేకపోయిన బీజేపీ, ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రతిష్ట మసకబారిందని బీజేపీకి తెలుసు. అయితే, హర్యానా, మహారాష్ట్రలను గెలుచుకోవడం ద్వారా ప్రధాని మోదీ కొంత ప్రతిష్టను తిరిగి సంపాదించాడు.
ఒకవేళ బీజేపీ ఢిల్లీలో గెలిస్తే, బీజేపీ తిరిగి బలోపేతం అవుతున్న పార్టీగా మారిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఢిల్లీలో విజయం రాబోయే బిహార్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే బీజేపీ విన్నర్లా ఎన్నికల బరిలోకి దిగుతుంది. రాజకీయపరంగా బీజేపీ కేజ్రీవాల్‌ను శత్రువుగా చూస్తోంది. అయితే, బీజేపీ కాంగ్రెస్‌పార్టీని పూర్తిగా తొలగించలేదు. కానీ, కేజ్రీవాల్ మాత్రమే ఆ పని చేయగలడు. ఇప్పటికే ఆయన ఢిల్లీ, పంజాబ్‌లో కాంగ్రెస్‌ను ఓడించి ప్రభుత్వాలను ఏర్పాటు చేశాడు. కాగా, కేసీఆర్ తెలంగాణలో ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది తప్ప బీజేపీ అధికారం సాధించలేకపోయింది.
కాంగ్రెస్ అండ్ ముస్లిం సీట్లు
2020 ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ముస్లింలు ఆధిపత్యం చెలాయించిన 7 సీట్లను గెలుచుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ముస్లిం సీట్లను గెలవడానికి లేదా కేజ్రీవాల్ గెలవకుండా ఆపడానికి మాత్రమే ముస్లిం సీట్లపై దృష్టి పెడుతోంది, కాంగ్రెస్ కేజ్రీవాల్‌ను దెబ్బతీయాలనుకుంటోంది. కాంగ్రెస్ మొదటి ప్రాధాన్యత కేజ్రీవాల్ ఓడిపోవడమే. హంగ్ అసెంబ్లీ ఏర్పడి, కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవసరమైతే, ఆయనను నియంత్రించడానికి కాంగ్రెస్ ఆయనకు మద్దతు ఇవ్వవచ్చు. ఇప్పటికీ కేజ్రీవాల్‌కు ఒక రాజకీయ ప్రయోజనం అండగా ఉంది.
బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అందుబాటులో లేరని ఢిల్లీ ఓటర్లకి తెలుసు. కేజ్రీవాల్, ఆయన పార్టీ నాయకులు వారికి అందుబాటులోనే ఉన్నారు. అంతేకాకుండా, ఆయన చేసిన కొన్ని పనుల వల్ల కేజ్రీవాల్ పట్ల ఇప్పటికీ కృతజ్ఞత ప్రజల్లో ఉంది. మధ్యతరగతి వారు పార్లమెంటు ఎన్నికలలో బీజేపీకి, అసెంబ్లీ ఎన్నికలలో కేజ్రీవాల్‌కు ఓటు వేస్తారు. మధ్యతరగతి వారు ఇప్పుడు కేజ్రీవాల్ కు కూడా అదేవిధంగా ఓటు వేస్తారా అనేది పెద్ద ప్రశ్న. మధ్యతరగతి వారు కేజ్రీవాల్‌కు ఓటు వేస్తే ఇక ఆయనను ఎవరూ ఆపలేరు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ, కేజ్రీవాల్ గెలిస్తే, ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండటం వల్ల బీజేపీ సీట్లను కోల్పోతోందని అర్థం. కానీ, కేజ్రీవాల్ విజయం రాహుల్ గాంధీకి అపారమైన సమస్యలను సృష్టిస్తుంది. కేజ్రీవాల్ ఢిల్లీలో ఓడిపోతే, ఆయన రాజకీయ మనుగడ సంక్షోభంలో పడినట్లవుతుంది.
ఆప్ సర్కారుపై కొంత వ్యతిరేకత
ఢిల్లీలో కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ప్రభుత్వంపై ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది. కేజ్రీవాల్ 2013 నుంచి ఢిల్లీని పాలిస్తున్నారు. మూడు ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు కేజ్రీవాల్ వరుసగా నాలుగోసారి ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేజ్రీవాల్ క్లీన్ ఇమేజ్‌ను కూడా ప్రభావితం చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం ముందువరకు కేజ్రీవాల్ గొప్ప ఇమేజ్‌ను కలిగి ఉన్నారు. విచిత్రంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రెండు రాష్ట్రాల తెలుగువారు ఉన్నారు.
కేజ్రీవాల్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నాయకులకు దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే వారివల్ల ఆయన రాజకీయ జీవితానికి ఎదురుదెబ్బ తగిలింది. కాగా, కేజ్రీవాల్ పేదలు, మధ్యతరగతి వర్గాల వారికి సహాయం చేశాడని కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. అతనితో పోటీపడటానికి ఢిల్లీలో బీజేపీ ఉచిత వాగ్దానాలను అతిగా చేస్తోంది. గత ప్రయోజనాల కోసం ప్రజలు కేజ్రీవాల్‌కు ప్రతిఫలం ఇస్తారా లేదా బీజేపీ భారీ ఆఫర్‌ల కోసం వెళ్తారా అనేది ప్రశ్న.
- పెంటపాటి పుల్లారావు,పొలిటికల్ ఎనలిస్ట్-