
హనుమకొండ, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే జనగామ మినహా మిగతా నియోజకవర్గాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఖరారు కాగా.. కాంగ్రెస్ తరఫున పోటీలో నిలిచేందుకు అశావహులు క్యూ కడుతున్నారు. టికెట్ కోసం అభ్యర్థులు దరఖాస్తు పెట్టుకునేందుకు ఈ నెల 18 నుంచి 25 వరకు అవకాశం ఇవ్వడంతో ఇప్పటికే పలువురు నేతలు అప్లికేషన్ సమర్పించారు. కాగా ముహూర్తం చూసుకుని అప్లికేషన్ పెట్టేందుకు మరికొందరు నేతలు రెడీ అయ్యారు. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే దాదాపు 12 దరఖాస్తులు అధిష్టానానికి చేరగా.. బుధ, గురు, శుక్రవారాల్లో మరికొందరు అప్లికేషన్లు పెట్టేందుకు రెడీ ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో పోటీ తక్కువగా ఉండగా.. మిగతా స్థానాల్లో ముగ్గురికిపైగా టికెట్ ఆశిస్తుండటం గమనార్హం.
ఆ రెండు స్థానాల్లోనే తక్కువ
ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ లో భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో పోటీ చాలా తక్కువగా కనిపిస్తోంది. ములుగులో సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క పోటీలో ఉన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం నుంచి గండ్ర సత్యనారాయణరావు టికెట్ఆశిస్తూ పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ రెండు స్థానాల నుంచి కాంగ్రెస్ తరఫున టికెట్ ఆశించే లీడర్లెవరూ పెద్దగా లేకపోవడంతో వారిద్దరికీ టికెట్ పక్కా అని తెలుస్తోంది.ఇవి మినహా ఉమ్మడి జిల్లాలోని మిగతా పది స్థానాల్లో కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ ఎక్కువగానే ఉంది.
ఒక్కోచోట ముగ్గురికిపైగానే..
జిల్లాలో కాంగ్రెస్ టికెట్ కోసం కొన్ని నియోజకవర్గాల్లో ముగ్గురు, నలుగురు పోటీ పడుతున్నారు. వర్ధన్నపేట టికెట్ కోసం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నమిండ్ల శ్రీనివాస్ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇదే స్థానాన్ని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఆశిస్తుండగా.. ఇక్కడి నుంచే రిటైర్డ్ పోలీస్ కమిషనర్ కే.ఆర్.నాగారాజు పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ ముగ్గురితో పాటు గతంలో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన దొమ్మాటి సాంబయ్య పేరు కూడా ప్రచారంలో ఉంది. ఇక వరంగల్ పశ్చిమ స్థానాన్ని హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి, జనగామ మాజీ డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి ఆశిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం వల్ల మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి పేరు వినిపిస్తోంది. అయితే జంగా రాఘవరెడ్డి గతంలో పాలకుర్తి నుంచి పోటీ చేయగా.. అక్కడి నుంచి ఇప్పుడు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పోటీలో ఉండే అవకాశం ఉంది.
ఓ వైపు పాలకుర్తి చేజారడం, మరోవైపు జనగామ డీసీసీ పదవి కూడా లేకపోవడంతో వరంగల్ పశ్చిమ టికెట్ కోసం జంగా తీవ్రంగానే శ్రమిస్తున్నారు. వరంగల్ తూర్పులో మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దంపతులు ఎప్పటినుంచో ప్రచారం చేస్తుండగా.. వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి స్వర్ణ కూడా టికెట్ ఆశిస్తున్నారు. దీంతోనే స్వర్ణకు తూర్పు టికెట్ కేటాయిస్తే.. కొండా సురేఖను పరకాలకు పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ లో మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్, పార్టీ సీనియర్ నేతలు డా.తేజావత్ బెల్లయ్యనాయక్, మురళీనాయక్ పేర్లు వినిపిస్తున్నారు. ఇప్పటికే వీళ్లంతా అధిష్టానానికి దరఖాస్తు పెట్టినట్లు తెలిసింది.
స్టేషన్ ఘన్ పూర్ నుంచి సింగారపు ఇందిర టికెట్ ఆశిస్తుండగా.. దొమ్మటి సాంబయ్య వర్ధన్నపేట మిస్ అయితే ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన రాంచంద్రునాయక్ తో పాటు మరో ముగ్గురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. జనగామ టికెట్ పై డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆశలు పెట్టుకుని ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
టికెట్ కోసం క్యూ..
ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం అప్లికేషన్లకు 25వ వరకు అవకాశం ఉండగా.. చాలామంది లీడర్లు మంచిరోజు కోసం చూసినట్లు తెలిసింది. దీంతో ఇప్పటివరకు దాదాపు 12 దరఖాస్తులు హైకమాండ్‌కు చేరగా.. బుధవారం సప్తమి నుంచి దరఖాస్తు పెట్టుకునేందుకు ఇంకొందరు నేతలు సిద్ధమవుతున్నారు. ఓ వైపు దరఖాస్తు పెట్టుకోవడంతో పాటు మరోవైపు తమతమ గాడ్ ఫాదర్ లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఉమ్మడి జిల్లా నుంచి వచ్చే దరఖాస్తుల్లో హైకమాండ్ ఎవరివైపు మొగ్గు చూపుతుందో చూడాలి.