- గులాబీ ఆపరేషన్!
- బీఆర్ఎస్ త్రిముఖ వ్యూహం
- అసంతృప్తుల మెడలో గులాబీ కండువాలు
- కారెక్కిన పొన్నాల, నాగం, రాగిడి, విష్ణు ?!
- కాంగ్రెస్, బీజేపీ ఓట్లు చీల్చేందుకు లీడర్ల ప్లాన్
- చేరికల్లో సామాజిక సమీకరణాలపైనా నజర్
- పాత ఉద్యమకారులకు కారు పార్టీ రెడ్ కార్పెట్
హైదరాబాద్: ప్రధాన పార్టీల్లోని అసంతృప్త నేతలను పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా గులాబీ పార్టీ ఆపరేషన్ కొనసాగుతోంది. వివిధ పార్టీల్లో టికెట్ ఆశించి భంగపడ్డ వారి ఇండ్లకు హరీశ్ రావు, కేటీఆర్ వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. పొన్నాల ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లి ఆహ్వానించిన విషయం తెలిసిందే. తాజా ఆపరేషన్ లో మంత్రి హరీశ్ కూడా జాయిన్ అయ్యారు. నిన్న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ వెళ్లి పార్టీలో చేరాలని ఆహ్వానించారు. ఇవాళ జూబ్లీ హిల్స్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ విష్ణువర్ధన్ రెడ్డి ఇంటికి మంత్రి హరీశ్ రావు వెళ్లారు.
పార్టీలో చేరాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ లోని అసంతృప్తులను, టికెట్ ఆశించి భంగపడ్డ వారిని తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండి కొట్టొచ్చనేది గులాబీ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. మరో వైపు పాత ఉద్యమకారులను పార్టీలోకి ఆహ్వనించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారులు, మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన చెరుకు సుధాకర్, జిట్టా బాలకృష్ణారెడ్డి తదితరులను బీఆర్ఎస్ లోకి చేర్చుకోవడం ద్వారా జాతీయ పార్టీలకు చెక్ పెట్టొచ్చనే వ్యూహం దాగి ఉందనే చర్చ నడుస్తోంది.
తాము మాత్రమే తెలంగాణకు ఆత్మ అని చెప్పుకొనే ప్రయత్నం చేస్తోంది. దీనికి తోడు ఉద్యమ గళాలకూ తిరిగి స్వాగతం పలుకుతోంది బీఆర్ఎస్. ఎవని పాలయ్యిందిరో తెలంగాణ.. ఎవడేలుతున్నడురో తెలంగాణ అంటూ కేసీఆర్ కు వ్యతిరేకంగా గళమెత్తిన ఏపూరి సోమన్నకు గులాబీ కండువా కప్పేయడంతో ఆ పార్టీ నేతలు సక్సెస్ అయ్యారు. మరో ఉద్యమ గాయకుడు, దరువు ఎల్లన్న కూడా బీఆర్ఎస్ లో చేరబోతున్నరని తెలుస్తోంది.
ముదిరాజ్ సామాజిక వర్గానికి న్యాయం చేయలేని పదే పదే ఆత్మవిమర్శ చేసుకుంటున్న ఆ పార్టీ అగ్రనాయకత్వం.. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగ సంఘాల నాయకుడు మామిళ్ల రాజేందర్, అంబర్ పేట శంకర్, బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ ను పార్టీలో చేర్చుకుంది. ఈ ఆపరేషన్ ద్వారా మొన్నటి వరకు తిట్టిన నోళ్లతోనే పొగిడించుకునే పనిలో పడిందనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ థర్డ్ లిస్ట్ రిలీజ్ చేస్తే మరికొంత మంది నాయకులు కారెక్కుతారని ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత ఒకరు బహిరంగంగానే వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇటీవల బీఆర్ఎస్ లో చేరిన ముఖ్యనేతలు
నాయకుడు పార్టీ
పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్
రాగిడి లక్ష్మారెడ్డి కాంగ్రెస్
సోమశేఖర్ రెడ్డి కాంగ్రెస్
చెరుకు సుధాకర్ కాంగ్రెస్
రావుల చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ
ఎర్ర శేఖర్ కాంగ్రెస్
జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్
ఏ కే గంగాధర్ రావు టీడీపీ
సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కాంగ్రెస్
పీ చంద్రశేఖర్ బీజేపీ
ఊదరి గోపాల్ బీజేపీ
పటేల్ ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్
బీల్యానాయక్ కాంగ్రెస్
చేరనున్న నేతలు
పీ విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్
నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్
రమాదేవి బీజేపీ
ముదిరాజ్ నాయకులు
మామిళ్ల రాజేందర్ ఉద్యోగ నేత
బిత్తిరి సత్తి@రవికుమార్ నటుడు
అంబర్ పేట శంకర్ సామాజికవర్గం నేత
ఉద్యమ కళాకారులు
ఏపూరి సోమన్న వైఎస్సార్టీపీ
దరువు ఎల్లన్న బీజేపీ