సైలెన్స్​ మోడ్​లోకి కాంగ్రెస్, బీజేపీ

సైలెన్స్​ మోడ్​లోకి కాంగ్రెస్, బీజేపీ
  •      అభ్యర్థులు ఫైనల్​ అయితేనే జనాల్లోకి
  •     రెండు పార్టీల లిస్టుల కోసం క్యాండిడేట్లతో పాటు క్యాడర్​ ఎదురుచూపులు
  •     ఇప్పటికే ప్రచారంలో బిజీగా మారిన బీఆర్ఎస్​ అభ్యర్థులు
  •     మూడు పార్టీలు బరిలోకి దిగితేనే ఎన్నికల ఊపు

మహబూబ్​నగర్, వెలుగు:రూలింగ్​ పార్టీ లీడర్లు నిత్యం పబ్లిక్​లో తిరుగుతుంటే, బీజేపీ, కాంగ్రెస్​ పార్టీల లీడర్లు మాత్రం అభ్యర్థిత్వాల కోసం వెయిట్​ చేస్తున్నారు. టికెట్ల కోసం అప్లై చేసుకొని రోజులు గడుస్తున్నా.. రెండు పార్టీల హైకమాండ్​లు క్యాండిడేట్ల లిస్ట్​ను ఫైనల్​ చేయకపోవడంతో లీడర్లు సైలెన్స్​గా ఉంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిత్వాల కోసం 70 మందికి పైగా ఆశావహులు అప్లై చేసుకున్నారు. 

వీరిలో హైకమాండ్​ ఇప్పటి వరకు ఒక్క పేరును కూడా ఫైనల్​ చేయలేదు. ఈ నెల మొదటి వారంలో పార్టీ స్క్రీనింగ్​ కమిటీ హైదరాబాద్​లో భేటీ అయినా, ఫస్ట్​ లిస్ట్​ గురించి క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల ఈ కమిటీ  మూడు రోజులు ఢిల్లీలో భేటీ అయింది. ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాల్లో ఐదు నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థుల పేర్లను ఫైనల్​ చేసినట్లు టాక్​ నడుస్తోంది. అయితే, ఢిల్లీలో కమిటీ ఉండడంతో ఆశావహులంతా అక్కడికి మకాం మార్చారు. టికెట్ల కోసం గాడ్​ఫాదర్​లు, ఏపీ, కర్ణాటకకు చెందిన లీడర్లతో పైరవీలు చేస్తున్నారు. దీంతో నియోజకవర్గాల్లో చాలా మంది లీడర్లు అందుబాటులో లేరు. కేవలం జిల్లా స్థాయిలో కొందరు లీడర్లు మాత్రమే ప్రెస్​మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. 

దీనికితోడు గద్వాల, వనపర్తి, మక్తల్​, నారాయణపేట, మహబూబ్​నగర్​, దేవరకద్ర, కల్వకుర్తి, నాగర్​కర్నూల్, షాద్​నగర్ నియోజకవర్గాల్లో ముగ్గురు, నలుగురు చొప్పున టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. వీరి మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. కొన్ని నియోజకవర్గాల నుంచి మాజీ మంత్రులు టికెట్​ ఆశిస్తున్నారు. ఇవే నియోజకవర్గాల నుంచి జూనియర్లు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఇటీవల ఇతర పార్టీల నుంచి జాయిన్ అయిన వారితో పాటు పాత లీడర్లు కూడా టికెట్ల కోసం పోటీ పడుతుండడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో టికెట్లు ఎవరికి ఇవ్వాలనే విషయంపై హైకమాండ్​ ఓ నిర్ణయానికి రావడం లేదు. ఈ తరుణంలో అభ్యర్థిత్వాలు కన్ఫాం అయ్యాకే పబ్లిక్​లోకి వెళ్లాలని లీడర్లు భావిస్తున్నట్లు తెలిసింది.

బీజేపీలోనూ అదే పరిస్థితి..

బీజేపీలోనూ ఇదే సీన్​ కొనసాగుతోంది. ఆ పార్టీ ఈ నెల ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు టికెట్ల కోసం అప్లికేషన్లు తీసుకుంది. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాలకు వందకు పైగా అప్లికేషన్లు వెళ్లాయి. పది రోజులు కావస్తున్నా.. ఇంత వరకు అభ్యర్థిత్వాలను ఫైనల్​ చేయలేదు. ఈ నెలాఖరు తర్వాతే అభ్యర్థిత్వాలు కన్ఫాం అవుతాయనే చర్చ నడుస్తోంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఒక వర్గానికి చెందిన లీడర్లు కావాలనే వారి క్యాడర్​తో అప్లై చేయించారనే ఆరోపణలున్నాయి. ఈ పరిణామాలతో ఇప్పటికే గ్రౌండ్​ వర్క్​ చేసుకుంటున్న లీడర్లంతా సైలెంట్​ అయ్యారనే చర్చ నడుస్తోంది. ఏదేమైనా అభ్యర్థిత్వాలు కన్ఫాం అయ్యాకే పబ్లిక్​లోకి వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.

జనాల్లోకి బీఆర్ఎస్..

ఎలక్షన్లకు టైం దగ్గర పడుతుండడంతో రూలింగ్​ పార్టీ క్యాండిడేట్లు నిత్యం పబ్లిక్​లో తిరుగుతున్నారు. కొత్త పనులకు శంకుస్థాపనలు, పెండింగ్​ పనులు పూర్తి చేయడంపై దృష్టి పెడుతున్నారు. అన్ని సామాజిక వర్గాల ఓటర్లను కలుస్తూ ఆత్మీయ సమ్మేళనాల పేరుతో దగ్గరవుతున్నారు. ఈ తరుణంలో పబ్లిక్​లో తిరగాల్సిన అపోజిషన్​ లీడర్లు సైలెంట్​గా ఉండడంపై ప్రజలు చర్చించుకుంటున్నారు.