ఢీ అంటే ఢీ .. తెలంగాణ కేంద్రంగా ఢిల్లీ పాలిటిక్స్

ఢీ అంటే ఢీ ..  తెలంగాణ కేంద్రంగా ఢిల్లీ పాలిటిక్స్

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు వారం రోజులే సమయం ఉండటంలో రాజకీయ వాతావరణం ఒక్క సారిగా వేడెక్కింది. మండుటెండల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ వేదికగా రెండు జాతీయ పార్టీల మధ్య విమర్శల యుద్ధం నడుస్తోంది. 10 నుంచి 12 సీట్లు లక్ష్యంగా పెట్టకున్న బీజేపీ.. ప్రచారాన్ని ముమ్మరం చేసింది. 14 సీట్లలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేతలను బరిలోకి దింపింది. నిన్న రాహుల్ గాంధీ, బీజేపీ నుంచి అమిత్​ షా ఎంట్రీ ఇవ్వడంతో సీన్ ఒక్క సారిగా మారిపోయింది. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని రాహుల్ పునరుద్ఘాటించారు. ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని, ఎట్టిపరిస్థితిలోనూ రాజ్యాంగాన్ని రద్దు చేయమని, తామే రాజ్యాంగ పరిరక్షకులమని అమిత్ షా చెప్పారు. 

సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చిన రిజర్వేషన్ల రద్దు అంశాన్ని రాష్ట్రానికి వచ్చిన బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. తామే రాజ్యాంగ పరిరక్షకులమని చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు.  ఏప్రిల్ 30న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని అల్లాదుర్గంలో పర్యటించారు. ఈ నెల1న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్, నిన్నకాగజ్ న గర్, నిజామాబాద్, మల్కాజ్ గిరిలలో జరిగిన సభల్లో మాట్లాడారు. మళ్లీ ఈ నెల 9, 10 తేదీల్లో వికారాబాద్, భువనగిరి, వనపర్తిలో అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్, మహబూబ్ నగర్, మహబూబాబాద్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.  

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధమీ సికింద్రాబాద్, మహబూబ్‌ నగర్, మహబూబాబాద్ లలో ప్రచారం నిర్వహించనున్నారు. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ సికింద్రాబాద్ పరిధిలో నిర్వహించే ప్రవాసీ సమ్మేళన్ లో పాల్గొంటారు. మాజీ గవర్నర్ తమిళిసై, తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై రాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ ఈ నెల 8, 10 తేదీల్లో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నిన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అలంపూర్, నిర్మల్ సభల్లో పాల్గొన్నారు. తిరిగి ఈ నెల 9న తిరిగి రాష్ట్రానికి వస్తున్న రాహుల్ గాంధీ కరీంనగర్, సరూర్ నగర్ జనజాతర సభల్లో పాల్గొంటారు. కాంగ్రెస్ కు చెందిన మరో అగ్రనేత ప్రియాంక గాంధీ ఈ నెల 10న రాష్ట్రానికి వస్తున్నారు. ఆ రోజు కామారెడ్డి, తాండూరు, షాద్ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 
 
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ

తెలంగాణలో ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయింది. ఈ రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అత్యధిక సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.