- కో రిటర్నింగ్ ఆఫీసర్లుగా కరుణాకర్, గీతామూర్తి
- త్వరలోనే జిల్లా ఎన్నికల అధికారుల నియామకం
- డిసెంబర్లోగా అన్ని కమిటీలూ పూర్తి చేసేలా ప్లాన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ సంస్థాగత ఎన్నికల హడావుడి మొదలైంది. బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలను నియమించేందుకు కమలం పార్టీ రెడీ అయింది. ఈ ఎన్నికలను పర్యవేక్షించేందుకుగాను రాష్ట్ర స్థాయిలో కమిటీని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ యెండల లక్ష్మీనారాయణ పేరును ప్రకటించింది. కో రిటర్నింగ్ ఆఫీసర్లుగా ఆ పార్టీ నేతలు కరుణాకర్, గీతామూర్తిని నియమించింది.
మరోపక్క ఎన్నికల షెడ్యూల్ను కూడా పార్టీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ప్రతి మూడేండ్లకు ఓసారి బీజేపీ కమిటీలను నియమిస్తుంటుంది. ఇందులో భాగంగా డిసెంబర్ నెలాఖరులోగా పార్టీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే జాతీయ స్థాయి కమిటీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా తెలంగాణకు చెందిన ఎంపీ కె. లక్ష్మణ్ నియమితులయ్యారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిటీని అధిష్టానం ప్రకటించింది.
ఈ నెల 27లోగా రాష్ట్ర స్థాయిలో వర్క్ షాప్ నిర్వహించనున్నట్టు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అప్పటిలోపే జిల్లా స్థాయి కమిటీలనూ వేయాలనే యోచనలో నేతలున్నారు. పార్టీ నిబంధనల ప్రకారం కమిటీలు వేసేలా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
పార్టీ రూల్స్ ప్రకారమే కమిటీలు..
అక్టోబర్ నెలాఖరు వరకూ బీజేపీ మెంబర్ షిప్ ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో నవంబర్ 1 నుంచి బూత్ లెవెల్ కమిటీలను నియమించనున్నారు. బూత్, మండల, జిల్లా స్థాయి కమిటీలను నియమించిన తర్వాత రాష్ట్ర కమిటీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే, మండలంలోని కనీసం సగం బూత్ లలో కమిటీలు వేస్తేనే మండల కమిటీ వేసేందుకు, జిల్లాలోని సగం మండలాల్లో కమిటీలు పూర్తయితేనే జిల్లా కమిటీలను నియమించుకునే అధికారం ఉంటుంది.
రాష్ట్ర కమిటీకి కూడా ఇదే రూల్ వర్తించనున్నది. అయితే, బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేయాలంటే కనీసం ఇద్దరైనా క్రియాశీలక సభ్యులు ఉండాలి. ఇలాంటి నిబంధనే అన్ని కమిటీలకు వర్తించనున్నది. గతంలో నిర్వహించిన ఎన్నికలకు ఆ స్థాయి ఎలిజిబులిటీ లేకపోవడంతో కమిటీలను నేరుగా నియమించారు. కానీ, ఈసారి మాత్రం నిబంధనల ప్రకారమే కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా డిసెంబర్ లోనే అన్ని కమిటీలనూ ఏర్పాటు చేసేలా ఆ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది.