- ఇప్పటికే కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న,
- బీఆర్ఎస్ తరఫున రాకేశ్‌రెడ్డి నామినేషన్
- నేడు నామినేషన్ వేయనున్న బీజేపీ క్యాండిడేట్
- ఈ నెల 27న వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక
- నేటితో ముగియనున్న నామినేషన్ గడువు
- ఇక స్పీడ్ అందుకోనున్న ప్రచారం
హైదరాబాద్, వెలుగు: వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలనుంచి అభ్యర్థులు ఖరారయ్యారు. బీజేపీ మరోసారి ప్రేమేందర్ రెడ్డిని తమ క్యాండిడేట్‌గా ప్రకటించింది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి పేర్లను ఆయా పార్టీలు ప్రకటించాయి. దీంతో ప్రధాన పార్టీల నుంచి ఈ ముగ్గురు నేతలతో పాటు ఇండిపెండెంట్లూ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.
ఈ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి పల్లా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 2న వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 9 వరకు నామినేషన్ల దాఖలుకు, ఈ నెల 13 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. ఈ నెల 27న పోలింగ్ ఉండగా, వచ్చే నెల 5న కౌంటింగ్ నిర్వహిస్తారు.
50 నామినేషన్లు దాఖలు
ఇప్పటికే 50 మంది వరకు నామినేషన్ వేశారు. కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న), బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి, టీడీపీ నుంచి ఎం.మల్లికార్జున్ రావు, బీఎస్పీ నుంచి బరిగెల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన బక్క జడ్సన్ ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ నుంచి గతేడాది పోటీ చేసి ఓడిపోయిన ప్రేమేందర్ రెడ్డికి మరోసారి ఎమ్మెల్సీ టికెట్‌ను అధిష్టానం కేటాయించింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రకాశ్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డి పేర్లను ఢిల్లీ అధిష్టానానికి ప్రతిపాదించగా, ప్రేమేందర్ రెడ్డికి టికెట్ ఖరారైంది. దీంతో ఆయన గురువారం నల్గొండ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
మొదలైన ప్రచారం
ఉప ఎన్నిక జరిగే సెగ్మెంట్ పరిధిలో మొత్తం 12 జిల్లాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు తమ ప్రచారాన్ని మొదలుపెట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఇప్పటికే వివిధ సంఘాలు మద్దతు ప్రకటించాయి. గతంలో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి, రెండో స్థానంలో నిలిచారు. ప్రైవేట్ టీచర్లు, టీచర్ల సంఘాలు, యువజన సంఘాలతో అభ్యర్థులు చర్చలు చేస్తూ, తమకు మద్దతివ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.