- 14 సీట్లతో బీజేపీ చివరి లిస్ట్
- మూడు స్థానాల్లో క్యాండిడేట్ల మార్పు
- కంటోన్మెంట్లో కాంగ్రెస్ వ్యక్తికి టికెట్ ఇచ్చారని ఆరోపణలు
హైదరాబాద్, వెలుగు : నామినేషన్ల దాఖలు చివరి రోజైన శుక్రవారం బీజేపీ ఫైనల్ లిస్ట్‌ను ప్రకటించింది. మొత్తం 14 మంది అభ్యర్థులను ప్రకటించగా ఇందులో11 కొత్త సీట్లు, 3 సీట్లలో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల స్థానంలో కొత్త పేర్లను వెల్లడించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేశారు. మొత్తంగా జనసేనకు ఇచ్చిన 8 సీట్లు మినహా 111 సీట్లకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. వేములవాడ బీజేపీ అభ్యర్థిగా తుల ఉమను ప్రకటించగా, శుక్రవారం పార్టీ బీఫాంను మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావుకు ఇచ్చారు.
సంగారెడ్డిలో రాజేశ్వరరావు పేరు ప్రకటించి బీఫాంను పులిమామిడి రాజుకు ఇచ్చారు. వనపర్తిలో బీజేపీ అభ్యర్థిగా అశ్వత్థామరెడ్డి పేరును ప్రకటించగా, ఆయన స్థానంలో అనూజ్ఞ రెడ్డికి టికెట్ ప్రకటించారు. బెల్లంపల్లిలో శ్రీదేవిని అభ్యర్థిని ప్రకటించి ఆమె స్థానంలో కొయ్యాల ఎమాజీని ప్రకటించారు. చాంద్రాయణ్ గుట్టలో సత్యనారాయణ పేరు ప్రకటించగా ఆయన అనారోగ్యం వల్ల మహేందర్ కు టికెట్ఇచ్చారు. కంటోన్మెంట్ టికెట్ ను శ్రీగణేశ్‌కు ఇవ్వగా ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడని, బీజేపీలో చేరలేదని ఆ నియోజకవర్గ నేతలు ఆరోపిస్తున్నారు. 2018లో బీజేపీ అభ్యర్థిగా శ్రీగణేశ్ పోటీ చేసి, తర్వాత బీఆర్ఎస్ లో చేరి కంటోన్మెంట్ టికెట్ ఆశించారు. బీఆర్ఎస్ టికెట్ రాకపోవటంతో ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో ఉండగా బీజేపీ టికెట్ ఇచ్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గంటలో మరో 2 పేర్లు
శుక్రవారం 14 మందితో బీజేపీ ప్రకటించిన లిస్టులో మరో 2 సీట్లలో అభ్యర్థులను పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి మార్చారు. గంట తర్వాత బెల్లంపల్లి సీటును కొయ్యాల ఎమాజీ స్థానంలో గతంలో ప్రకటించిన విధంగానే శ్రీదేవి పోటీ చేస్తారని, అలంపూర్ లో మారెమ్మ స్థానంలో రాజగోపాల్‌కు ఇస్తున్నట్లు పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.
ALSO READ: ఖమ్మం: చివరి రోజు భారీ నామినేషన్లు