ఉద్యోగులను అరిగోస పెడుతున్న కేసీఆర్ : కొత్తపల్లి శ్రీనివాస్

కాగజ్ నగర్, వెలుగు : రాష్ట్రంలోని అన్ని రంగాల ఉద్యోగులను సీఎం కేసీఆర్ అరిగోస పెడుతున్నారని బీజేపీ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. బెజ్జుర్ లో సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లకు ఆయన గురువారం సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ ప్రజలు, ఉద్యోగస్తులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో అన్ని రంగాల ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు, రాస్తారోకోలు చేసే పరిస్థితికి తీసుకొచ్చారని ఫైరయ్యారు. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో వీరికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ధోని శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.