మే 4వ తేదీ గురువారం జమ్మూకాశ్మీర్ లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన పబ్బ అనిల్ మరణించాడు. జవాన్ అనిల్ మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే బండి సంజయ్ అనిల్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
కుటుంబ పెద్దను కోల్పోయి విలపిస్తున్న కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు యత్నించారు బండి సంజయ్. అక్కడే ఉన్న జిల్లా నేతలతో మాట్లాడిన ఆయన.. అనిల్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండాలని ఆదేశించారు. అంతిమ సంస్కార ఏర్పాట్లతోపాటు తదుపరి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాలని కోరారు.
ఇక మృతుడికి భార్య సౌజన్య, ఇద్దరు కుమారులు ఆయన్ (6) అరో (3) ఉన్నారు. 45 రోజులు లీవ్ పై స్వగ్రామానికి వచ్చిన అనిల్.. 10 రోజుల క్రితమే తిరిగి ఆర్మీకి వెళ్లాడు. మృతుడు అనిల్ 10 ఏళ్ల క్రితం ఆర్మీలో చేరాడు. ఈ ఘటనలో మరో జవాన్లకు ఇద్దరికీ తీవ్రగాయాలు అయ్యాయి.