గవర్నర్​కు రాజకీయాల్ని ఆపాదిస్తున్నరు: బండి సంజయ్​

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనుకుంటున్న నిర్ణయాన్ని స్వాగతిస్తామని కరీంనగర్​ఎంపీ బండి సంజయ్​ అన్నారు. ఇదే సమయంలో బిల్లులో లోపాల్ని సరిచేయాలని గవర్నర్​చెబుతుంటే ఆమెకు రాజకీయాలు ఆపాదిస్తూ బీఆర్​ఎస్​ నీచ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. 

కరీంనగర్​జిల్లా రామడుగు మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న మోతె బ్రిడ్జిని ఆయన బీజేపీ నేతలతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరదలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు ఇస్తామని ఇంకా ఇవ్వలేదన్నారు. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి  సీఎం కేసీఆర్ 4 ఏళ్లు తీసుకున్నారని.. అదే బిల్లు ఆమోదానికి గవర్నర్ తమిళిసై కొంచం ఆలోచించకూడదా అని ప్రశ్నించారు. ఆగమేఘాల మీద స్టాంప్​ వేసి పంపితే.. బిల్లుతో ఏదైనా నష్టం వస్తే గవర్నర్​సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. 

గవర్నర్​ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చే విధంగా బీఆర్​ఎస్​ సర్కార్​ ప్రయత్నిస్తుందని విమర్శించారు. కార్మికులకు నష్టం కావొద్దనే ఉద్దేశంతోనే తమిళిసై బిల్లును పరిశీలిస్తున్నట్లు వివరించారు. అసెంబ్లీ సమావేశాలను మరికొన్ని రోజులు పొడగించి.. ఆర్టీసీ బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరపాలని డిమాండ్​ చేశారు. 

నిధులేం సరిపోతయ్..

వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జీల మరమ్మతులకు విడుదల చేసిన రూ.500 కోట్లు కరీంనగర్​ జిల్లాకే సరిపోవని.. రాష్ట్రం మొత్తానికి ఎలా సరిపెడతారని ప్రభుత్వాన్ని బండి ప్రశ్నించారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు కూడా అందించలేని పరిస్థితిలో సీఎం కేసీఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు. 

రాష్ట్ర అధికారులు, ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో సమర్పించిన పంట నష్టం నివేదికలన్నీ తప్పుల తడకలే అని విమర్శించారు. కేసీఆర్​పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు.  ఆగస్టు 6న భారత్​అమృత్​పథకంలో భాగంగా కరీంనగర్​ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు.