
- ఈ గెలుపుతో కాంగ్రెస్‌కు రంజాన్ గిఫ్ట్ ఇచ్చాం: బండి సంజయ్
- ఇకపై ఏ ఎలక్షన్ జరిగినాతమదే గెలుపని ధీమా
కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల చాంపియన్ ట్రోఫీలో బీజేపీ విజయం సాధించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు గుణపాఠమని పేర్కొన్నారు. ముస్లింలంతా ఏకమై బీజేపీని ఓడించాలని చూస్తే.. హిందూ సమాజమంతా కాంగ్రెస్‌ను ఓడించి ఆ పార్టీకి రంజాన్ గిఫ్ట్ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ ఎలక్షన్స్‌లో గెలిచేందుకు నోట్లు పంచిన వారిని వదిలిపెట్టబోమని, గూగుల్ పే వివరాల లెక్కలు తీస్తున్నామని హెచ్చరించారు.
కరీంనగర్–-నిజామాబాద్–-ఆదిలాబాద్–-మెదక్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించిన అనంతరం మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, తదితరులతో కలిసి బండి సంజయ్ సంబురాలు జరుపుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇది నాలుగో విజయమని, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలతోపాటు నిన్న టీచర్స్ ఎమ్మెల్సీ, ఇయాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు సాధించామని తెలిపారు.
బీఆర్ఎస్ మద్దతివ్వడంతోనే మూడోస్థానానికి హరికృష్ణ
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోట్ల సంచులు ఓడిపోయాయని, ఓటర్లే గెలిచారని బండి సంజయ్ అన్నారు. ‘‘ఈవీఎంలను మేనేజ్ చేసి బీజేపీ గెలుస్తున్నదని పదేపదే దుష్ప్రచారం చేసిన రాహుల్ గాంధీని నేను ప్రశ్నిస్తున్నా.. ఈవీఎంల ద్వారా మాత్రమే కాదు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిర్వహించిన బ్యాలెట్ పేపర్ ద్వారా కూడా బీజేపీయే గెలిచింది. దీనికేం సమాధానం చెబుతారు?” అని అన్నారు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ రెండో స్థానంలో ఉంటారని తాము భావించామని చెప్పారు. అయితే.. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆయనకు మద్దతివ్వడంతో గ్రాడ్యుయేట్లు ఆయనను మూడోస్థానానికి పరిమితం చేశారని అన్నారు.