యాదాద్రి, వెలుగు: తాను ఇచ్చిన హామీలు గెలిచాక నెరవేర్చకుంటే ఎక్కడికక్కడ నిలదీయాలని బీజేపీ భువనగిరి అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి సూచించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి స్వార్థం రాజకీయాలతోనే ట్రిపుల్ ఆర్ రాయగిరి మీదుగా వెళ్తోందని ఆరోపించారు.
తాను గెలిచిన వెంటనే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పిస్తానని తెలిపారు. ఐటీ హబ్ ఏర్పాటు చేయించి.. ప్రత్యక్షంగా 30 వేల మందికి , పరోక్షంగా 70 వేల మందికి ఉపాధి కల్పిస్తానని, సొంత డబ్బులతో డిగ్రీ కాలేజీ కట్టిస్తానని హామీ ఇచ్చారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి.. రెగ్యులర్‌గా కోచింగ్ ఇప్పిస్తానని చెప్పారు.
భువనగిరి నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పిస్తానని, మూసీ నది ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటానని మాటిచ్చారు. గెలిచిన తర్వాత అందుబాటులో లేకున్నా.. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయకున్నా నిలదీసి అడిగే అధికారం ప్రజలకు ఇస్తున్నానని ప్రకటించారు. అనంతరం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీజేపీలో చేరగా.. కండువాలు కప్పి ఆహ్వానించారు.