రైతులకు బీజేపీ పెద్ద శత్రువు :  మల్లికార్జున ఖర్గే

రైతులకు బీజేపీ పెద్ద శత్రువు :  మల్లికార్జున ఖర్గే
  • డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఓడిస్తేనే మహారాష్ట్ర రైతులకు ప్రయోజనం: ఖర్గే

న్యూఢిల్లీ: మహారాష్ట్ర రైతులకు బీజేపీ పెద్ద శత్రువని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించడం ద్వారా మాత్రమే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆ రాష్ట్రం నిర్ణయించిందని నొక్కి చెప్పారు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలపై సోమవారం ఆయన  ఎక్స్​వేదికగా బీజేపీపై విమర్శలు గుప్పించారు.

ఆ రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దుతామని బీజేపీ చేసిన వాగ్దానం జుమ్లాగా మారిందని మండిపడ్డారు. ‘‘మహారాష్ట్రలో 20 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యవసాయ నిధుల్లో భారీ కోత విధించారు. రూ.20 వేల కోట్ల వాటర్ గ్రిడ్ వాగ్దానం అబద్ధమని తేలింది. మహారాష్ట్రను కరువు రహితంగా తీర్చిదిద్దుతామన్న హామీ జుమ్లాగా మారింది. బీమా కంపెనీలకు 8వేల  కోట్ల రూపాయలు అందించిన బీజేపీ ప్రభుత్వం.. రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి మాత్రం నిరాకరిస్తున్నదని ఖర్గే మండిపడ్డారు.

రాష్ట్రంలోని పాల సహకార సంఘాలు సంక్షోభంలో ఉన్నాయని, దానిని ప్రభుత్వమే అంగీకరించిందని ఖర్గే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగిస్తేనే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని మహారాష్ట్ర నిర్ణయించిందని, ప్రస్తుతం ఆ రాష్ట్ర డిమాండ్ మహాపరివర్తన్ అని ఖర్గే అన్నారు.