బీజేపీ..బీఆర్ఎస్​ లు రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయి

బీజేపీ..బీఆర్ఎస్​ లు రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయి
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్​లపై రాహుల్ గాంధీ విమర్శ
  • అంబేద్కర్ ఆదర్శాలకు వారు వ్యతిరేకం: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: దేశ రాజ్యాంగంపై బీజేపీ-ఆర్‌‌ఎస్‌‌ఎస్‌‌లు దాడి చేస్తున్నాయని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీఆర్ అంబేద్కర్ వంటి దళిత ప్రముఖుల పట్ల గౌరవం ఉన్నట్లు నటిస్తూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. బుధవారం కాంగ్రెస్ నేత జగ్‌‌లాల్ చౌదరి జయంతి సందర్భంగా బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.."దళితులు, గిరిజనులు, ఓబీసీలకు కేవలం రాజకీయ ప్రాతినిధ్యం సరిపోదు. వారు అన్ని రంగాలలో మెరుగుపడాల్సిన అవసరం ఉంది. దళితులు, గిరిజనులు, ఓబీసీలను నాయకులుగా చూడాలన్నదే నా లక్ష్యం. దేశంలో రాజ్యాంగం అమలులో ఉన్నంత వరకు దళితులు, సమాజంలోని ఇతర అణగారిన వర్గాలు మెరుగైన జీవితాన్ని పొందుతాయి. ఈ విషయం బీజేపీ, ఆర్‌‌ఎస్‌‌ఎస్‌‌కు బాగా తెలుసు. 

అందుకే వారు రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు. కానీ బహిరంగంగా కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగానికి, అంబేద్కర్ విగ్రహానికి నమస్కరిస్తున్నట్లు కనిపిస్తారు. ఆర్‌‌ఎస్‌‌ఎస్ నాయకులు కూడా అంబేద్కర్‌‌పై పాటలు పాడటం చూడవచ్చు. పైకే వారు అలా కనిపిస్తారు. కానీ అంబేద్కర్ ఆదర్శాలకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తుంటారు. మోదీ అణగారిన వర్గాలకు ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తారు. కానీ ఆయన గెలిచాక.. ఆ ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి అన్ని అధికారాలను లాక్కుంటున్నారు. 

ఆర్‌‌ఎస్‌‌ఎస్ సిఫార్సు చేసినవారికే మంత్రి పదవులు ఇచ్చారు. మీడియాలో దళితుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో వారి సమస్యలు హైలైట్ కావడం లేదు. దేశంలోని బిలియనీర్లలో ఒక్క దళితుడు కూడా లేడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కుల గణన ద్వారా మాత్రమే అణగారిన వర్గాల జీవితం మారుతుంది" అని రాహుల్ పేర్కొన్నారు. 

మేక్ ఇన్ ఇండియా విఫలమైంది..

'మేక్ ఇన్ ఇండియా' పూర్తిగా విఫలమైందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మేక్ ఇన్ ఇండియా గురించి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ఇది మంచి ఆలోచనే అయినప్పటీకి విఫలమైనట్లు ప్రధానమంత్రి అంగీకరించాల్సిందని చెప్పారు.