బీసీ ధర్నాకు బీజేపీ, బీఆర్ఎస్ దూరం..బీసీ సంఘాలు కోరినా సైలెంట్​

బీసీ ధర్నాకు బీజేపీ, బీఆర్ఎస్ దూరం..బీసీ సంఘాలు కోరినా సైలెంట్​
  • మద్దతివ్వాలని రెండు పార్టీలను బీసీ సంఘాలు కోరినా సైలెంట్​
  • కీలక ధర్నాకు హాజరుకాకపోవడంపై సొంత పార్టీల్లో భిన్నాభిప్రాయాలు

హైదరాబాద్, వెలుగు: 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బుధవారం నిర్వహించతలపెట్టిన ‘బీసీ పోరు గర్జన’ సభకు  బీజేపీ, బీఆర్ఎస్  దూరంగా ఉన్నాయి.  ఈ ధర్నాకు రావాలని బీసీ సంఘాలు కోరినా ఆ రెండు పార్టీలు సైలెంట్​గానే ఉన్నాయి. కాగా, ఈ ధర్నాలో పాల్గొనేందుకు 12 బీసీ సంఘాలకు చెందిన సుమారు1500 మంది ప్రతినిధులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో సోమవారమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. 

వీరికి సంఘీభావంగా ధర్నాలో పాల్గొనేందుకు  సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్​కుమార్ గౌడ్, బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, విప్ లు , బీసీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు,  కాంగ్రెస్​కు చెందిన బీసీ నేతలు మంగళవారం ఢిల్లీ చేరుకున్నారు. ఏపీతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి మరో  1500 మంది బీసీ ప్రతినిధులు హాజరు కానున్నారు..  కాగా, ఢిల్లీ వెళ్లేముందే - బీసీ సంక్షేమ సంఘం  జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​గౌడ్​నేతృత్వంలో బీసీ సంఘాల నేతలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్​ నేతలను కలిసి పోరుగర్జన సభకు ఆహ్వానించారు. 

అయితే, మంగళవారం అర్ధరాత్రి వరకు బీజేపీ, బీఆర్ఎస్ నుంచి ముఖ్య నేతలెవరూ ఢిల్లీకి వెళ్లలేదు. బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామంటూ కొద్దిరోజులుగా ఊదరగొడ్తున్న ఈ రెండు పార్టీల నేతలు బిల్లుల ఆమోదం కోసం కేంద్ర సర్కారుపై ఒత్తిడి తీసుకురావాల్సిన కీలక సమయంలో ఇలా తప్పించుకోవడంపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు మంగళవారం ఢిల్లీ వేదికగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​గౌడ్​సహా పలువురు బీసీ సంఘాల నేతలు ఈ రెండు పార్టీల నేతల వ్యవహార శైలిని తప్పుపట్టారు. 

రాలేమని ముందే చెప్పిన కేంద్రమంత్రి కిషన్​రెడ్డి!

బీసీ పోరుగర్జన  సభకు తాము హాజరుకాలేమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నట్టు బీసీ సంఘాల నేతలు చెప్తున్నారు. ఇందుకు ఆయన చెప్పిన కారణం చిత్రంగా ఉందంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణనలో ముస్లింలు సైతం ఉన్నారని,  అందువల్ల తాము మద్దతు ఇవ్వలేమని అన్నట్టు  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్  ‘వెలుగు’కు తెలిపారు. 

‘మరి అసెంబ్లీలో బీసీ బిల్లుకు బీజేపీ మద్దతు ఇచ్చింది కదా? ’ అని అడిగితే  తమ పార్టీలోని బీసీ నేతల విజ్ఞప్తి మేరకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చామని కిషన్​రెడ్డి అన్నట్టు జాజుల వివరించారు. ఈ లెక్కన బుధవారం జంతర్​మంతర్​ వద్ద జరిగే పోరుగర్జన సభకు బీజేపీ నుంచి ముఖ్య నేతలెవరూ రావడం లేదని తెలుస్తున్నది. కాగా, బీఆర్ఎస్​లోనూ ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తున్నది.

సోమవారం ఢిల్లీ వెళ్లే ముందే బీసీ సంఘాల నేతలు బీఆర్ఎస్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్, మాజీ స్పీకర్ మధుసూదనచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులను కలిసి ఢిల్లీ ధర్నాకు ఆహ్వానించారు. వీరిలో ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తాము ధర్నాకు హాజరవుతామని చెప్పినా.. మంగళవారం వరకు వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. 

మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొంతకాలంగా బీసీ నినాదంతో  వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రస్తుత బీసీ సంఘాల పోరు గర్జనపై నోరు విప్పడం  లేదు. ఆమె కేవలం పార్టీ బీసీ అనుబంధ విభాగం నేతలతో మాట్లాడడం తప్ప బయట బీసీ సంఘాల నేతలతో కలవడం లేదు. తమ ఒత్తిడితోనే అసెంబ్లీలో ప్రభుత్వం బిల్ ప్రవేశపెట్టి, ఆమోదించిందని పలుసార్లు కవిత ప్రకటించారు. కానీ కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాల్సిన కీలక సమయంలో ఆమె పక్కకు తప్పుకున్నారని బీఆర్ఎస్ లో ఉన్న బీసీ నేతలేవ్యాఖ్యానిస్తున్నారు.