కాగజ్ నగర్, వెలుగు : రాష్ట్రంలో బీఎస్పీ బలపడడం చూసి ఓర్వలేకనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ పార్టీపై అసత్య ఆరోపణలు చేశారని రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో మీడియా సమావేశంలో పార్టీ జాతీయ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్, రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ మంద ప్రభాకర్ తో కలిసి ఆయన మాట్లాడారు.
బీజేపీ ఓట్లను చీల్చి బీఆర్ఎస్, కాంగ్రెస్ కు బీఎస్పీ సహకరిస్తున్నదని కాగజ్ నగర్ ఎన్నికల సభలో యోగి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. సిర్పూర్ లో బీఎస్పీని ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయన్నారు. రాబోయే ఎన్నికల్లో సిర్పూర్ గడ్డపై నీలి జెండా ఎగరడం ఖాయమన్నారు. బీజేపీకి బీ టీమ్ ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి సీడం గణపతి తదితరులు పాల్గొన్నారు.