
- బెల్లంపల్లిలో ఐటీ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తం
- ఓటమి భయంతోనే ప్రభుత్వంపై ఆ పార్టీల విమర్శలంటూ ఫైర్
బెల్లంపల్లి, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన16 నెలల్లోనే నిరుద్యోగులకు 57 వేల జాబ్ లు ఇచ్చామని, జాబ్ క్యాలెండర్‌ను అమలు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంగళవారం రాత్రి బెల్లంపల్లి టౌన్ లోని ఆర్ పీ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తున్నాయని, ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఓటమి భయంతోనే ప్రభుత్వంపై ఆ పార్టీలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.
బెల్లంపల్లి టౌన్ లో త్వరలో ఐటీ పార్క్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో కృషి చేస్తామన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి నరేందర్ రెడ్డి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సభలో స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మున్సిపల్ మాజీ చైర్మన్ జక్కుల శ్వేత, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్ తదితరులు పాల్గొన్నారు.