- త్వరలో జిల్లాకు రానున్న రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్
- పాదయాత్రలకు శ్రీకారం చుడుతున్న నియోజకవర్గ లీడర్లు
మహబూబ్‌నగర్, వెలుగు: ఎలక్షన్లు దగ్గర పడుతుండడంతో బీజేపీ హైకమాండ్ ఉమ్మడి పాలమూరు జిల్లాపై ఫోకస్ పెట్టింది. జిల్లా నుంచి మెజార్టీ సీట్లు గెలవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. పాలమూరు, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో కర్నాటక రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి రాజేశ్ పర్యటించనున్నారు. అలాగే ఈ నెల 17 తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలో బస్సుయాత్రకు ప్లాన్ చేశారు. ఈ మేరకు రూట్ మ్యాప్‌పై కసరత్తు జరుగుతోంది.
కేంద్ర స్కీంలు, నిధులపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్
త్వరలో పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లాలు, మండలాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి మంజూరు చేసిన నిధుల గురించి, తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీంల గురించి ప్రజలకు వివరించనున్నారు. ఇందులో భాగంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయనున్నారు. త్వరలో పర్యటన తేదీలను ఖరారు చేయనున్నారు. రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. పబ్లిక్‌లోకి ఎలా వెళ్లాలి? ఎలక్షన్లకు కేడర్‌ను ఎల సన్నద్ధం చేయాలి? అనే విషయాలపై స్థానిక లీడర్లతో చర్చించనున్నారు. ఇదే సందర్భంలో రెండు రోజుల పాటు ఓటరు నమోదు పక్రియను పరిశీలించనున్నారు.
ర్నాటక రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి రాజేశ్‌కు పాలమూరు, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ బాధ్యతలను అప్పగించారు. ఆయన అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా లీడర్లతో సమావేశం కానున్నారు. ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై లీడర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. రూలింగ్ పార్టీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల గురించి, నియంతృత్వ పాలన, అవినీతి, అక్రమాలపై ప్రజలకు వివరించేలా ‘గడప గడపకు బీజేపీ’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అలాగే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
బస్సు యాత్రకు రాష్ట్ర, జాతీయ లీడర్లు
ఈ నెల17 తర్వాత రాష్ట్రంలో ఒకేసారి మూడు రూట్లలో బస్సు యాత్రలు నిర్వహించనున్నారు. ఇందులో ఒక యాత్ర ఉమ్మడి రంగారెడ్డి, పాలమూరు, నల్లగొండ జిల్లాల మీదుగా వెళ్తుంది. ఏఏ నియోజవర్గాల మీదుగా వెళ్లాలనే దానిపై రూట్ మ్యాప్‌ను రెండు, మూడు రోజుల్లో ఫైనల్ చేయనున్నారు. ఈ యాత్రలో కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి చెందిన లీడర్లు వంద మంది వరకు పాల్గొనున్నారు. ప్రతి రోజూ ఐదుగురు చొప్పున జాతీయ, రాష్ట్ర లీడర్లు యాత్రలో చీఫ్ గెస్ట్లుగా పాల్గొంటారు. యాత్రకు ఒకరిని ఇన్చార్జిగా నియమించనుండగా, లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ పేర్లను ఫైనల్ చేశారు. వీరిలో ఎవరికి ఉమ్మడి పాలమూరు బాధ్యతలు అప్పగిస్తారనేది త్వరలో తేలనుంది.
ప్రజా సంగ్రామ యాత్ర- 2 స్ఫూర్తితో..
ఉమ్మడి జిల్లా మీదుగా గత ఏడాది మేలో అప్పటి బీజేపీ స్టేట్చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర-–2 నిర్వహించారు. ఈ యాత్ర కేడర్‌లో ఫుల్ జోష్ నింపింది. ఉమ్మడి జిల్లాలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఇక్కడి పరిస్థితుల గురించి, రూలింగ్ పార్టీ లీడర్ల అవినీతి, అక్రమాలపై ప్రజలు చెప్పిన వివరాలను ఆయన నోట్ చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి సమస్యల ప్రస్తావిస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టనున్నట్లు తెలిసింది. ప్రజా సంగ్రామ యాత్రను ఆదర్శంగా తీసుకున్న ఎల్లేని సుధాకర్‌రావు కొల్లాపూర్ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ నెల 4 నుంచి జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన యూత్ లీడర్ ఆర్ బాలా త్రిపుర సుందరి ‘పల్లె పల్లెలో కమల వికాసం’ పేరుతో పాదయాత్రను ప్రారంభించనున్నారు. ప్రతి గడపకూ బీజేపీ సింబల్‌ను తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.