బియ్యం కయ్యం!.. క్రెడిట్ వేటలో కమలం పార్టీ..మోదీ ఫొటో పెట్టాలని కిరికిరి

బియ్యం కయ్యం!.. క్రెడిట్ వేటలో కమలం పార్టీ..మోదీ ఫొటో పెట్టాలని కిరికిరి
  • కేంద్రమే సన్నబియ్యం ఇస్తోందంటూ పలు చోట్ల ఫ్లెక్సీలు, సోషల్ మీడియాలో ప్రచారం
  • రూ. 40 కేంద్రమే ఇస్తోందన్న బండి సంజయ్
  •  రూ. 10 మాత్రమే రాష్ట్రం ఖర్చు చేస్తోందట
  • అదే నిజమైతే దేశమంతా సన్నబియ్యం ఎందుకు ఇవ్వట్లేదంటున్న కాంగ్రెస్

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది.  పేదల కోసం ఆలోచించే ఈ పథకం తెచ్చామని కాంగ్రెస్ అంటుంటే.. ఈ పథకం ఖర్చులో మెజార్టీ వాటా కేంద్రానిదే అనే వాదనను బీజేపీ నాయకులు తెరపైకి తెచ్చారు. అంతటితో ఆగక రేషన్ షాపులకు వెళ్లి ఏకంగా మోదీ ఫొటోలను అతికిస్తున్నారు. సోషల్ మీడియాలో మోదీ ఫొటోలతో కూడిన పోస్టర్లను షేర్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో బీజేపీ కార్పొరేటర్లు రేషన్ షాపులకు వెళ్లి మరీ మోదీ పోస్టర్లు అతికిస్తున్నారు. 

ALSO READ | హైదరాబాద్ సిటీలో ..కుప్పలు తెప్పలుగా రేషన్ కార్డు అప్లికేషన్లు

ఇదే అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం  ప్రతి ఒక్కరికీ ఆరు కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తోందని ఇందులో కిలో రూ. 40 సెంట్రల్ గవర్నమెంట్ చెల్లిస్తోందని, రాష్ట్రం వాటా రూ. 10 మాత్రమేనని చెబుతున్నారు. అలాంటప్పుడు ప్రతి రేషన్ షాపులో మోదీ ఫొటో తప్పక ఉండాల్సిందేనని అంటున్నారు. బండి సంజయ్ చెప్పే మాటలే నిజమైతే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సన్నబియ్యం  పంపిణీ చేయాలని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న వడ్ల పండించే రైతులకు క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ ఇచ్చి కొనుగోలు చేసి, ఏడాదికి సరిపడా ధాన్యం సమకూర్చి బియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. 

వాస్తవానికి ఎన్టీఆర్ కన్నా ముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1.90 పైసలకే కిలో బియ్యం పంపిణీ చేశారని, తర్వాత ఎన్టీఆర్ రూ. 2 కి కిలో బియ్యం ప్రాచుర్యంలోకి తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ ప్రారంభం సందర్భంగా చెప్పారు. వానాకాలంలో కొనుగోలు చేసిన సన్నవడ్లను సీఎంఆర్ కింద మిల్లులకు ఇచ్చిన ప్రభుత్వం.. అందులో దాదాపు సగం బియ్యాన్ని ఇప్పటికే జిల్లా స్థాయి గోదాములకు తరలించింది.