కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే కోవర్టులు కాదు.. పేదలకు కొండంత అండ

కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే కోవర్టులు కాదని.. పేద ప్రజలకు కొండంత అండ అని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్  అవినీతి సొమ్మంతా కక్కించి కటకటాలలోకి పంపిస్తామని, తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలంటే కేసీఆర్ ను గద్దెదించాలని కోరారు. ఎనిమిది ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు నియోజకవర్గానికి ఒక్క పైసా ఇవ్వలేదని..కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వెయ్యి కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. శుక్రవారం ఆయన నాంపల్లి మండలం గట్ల మల్లేపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  

ప్రచారానికి వచ్చిన రాజ్ గోపాల్ రెడ్డికి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియాతో పాటు కాళేశ్వరం పేరిట కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు దోచుకుందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ దోచుకున్నసొమ్మంతా కక్కియ్యకపోతే తన పేరు రాజగోపాల్ రెడ్డి కాదన్నారు. అసెంబ్లీలో ప్రజల తరఫున అడిగేవాళ్ళే లేకుండా 12 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని సీఎం కేసీఆర్ ఖూనీ చేశాడని విమర్శించారు. మునుగోడులో విజయం బీజేపీకే దక్కుతుందని వెల్లడించిన రాజ్ గోపాల్ రెడ్డి.. తాను గెలిచిన వెంటనే గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి , నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు అందెల శ్రీరాముల  యాదవ్  పాల్గొన్నారు.