పాలమూరు ప్రజలకు అండగా ఉంటా : ఏపీ మిథున్ రెడ్డి

పాలమూరు ప్రజలకు అండగా ఉంటా :   ఏపీ మిథున్ రెడ్డి

పాలమూరు, వెలుగు : పాలమూరు ప్రజలు అధైర్య పడాల్సిన అవసరం లేదని, తాను అండగా నిలుస్తానని మహబూబ్​నగర్​ బీజేపీ అభ్యర్థి ఏపీ మిథున్​రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని బాయ్స్  జూనియర్​ కాలేజ్​లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ చీఫ్​ గెస్ట్​గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మిథున్​రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ ఇద్దరు శ్రీనివాసులు ఉన్నారన్నారు.

ఒకాయన మంత్రి అని, ఆయన బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయనకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఓటర్లకు సూచించారు. బీసీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన ప్రజల వద్దకు వెళ్తూ, బీసీలపైనే దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. మరో వ్యక్తి ఎన్నికలు ముగిశాక పదేండ్ల వరకు ప్రజలకు కనిపించలేదని ఆరోపించారు. పాలమూరు అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పాలమూరులో ప్రజలకు ఉపయోగపడే కంపెనీలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు.

30న జరిగే ఎన్నికల్లో ఒకటో నంబర్​ మీద ఉన్న కమలం పువ్వు గుర్తు మీద ఓట్లు వేసి, ఈ ఒకటో నెంబర్​ కుర్రాడిని గెలిపించాలని కోరారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యడు జితేందర్​ రెడ్డి మాట్లాడుతూ సబ్కా సాత్.. సబ్క వికాస్.. సబ్కా ప్రయాస్  నినాదంతో బీజేపీ పని చేస్తుందన్నారు. ఎన్నికల ముందు ఒక విధంగా, ఎన్నికల తరువాత మరో విధంగా మారే నాయకుల మాయమాటలకు మోసపోవద్దని సూచించారు. జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, రాష్ట్ర నాయకురాలు పద్మజారెడ్డి, లీడర్లు డోకూరు పవన్​ కుమార్​రెడ్డి, అచ్చుగట్ల అంజయ్య, ఆంజనేయులు, పాలమూరు సీడ్స్​ ప్రతినిధి సుదర్శన్​రెడ్డి పాల్గొన్నారు.