బీజేపీ, ఆర్ఎస్ఎస్​ను బద్నాం చేస్తే ఊరుకోం : బండి సంజయ్

బీజేపీ, ఆర్ఎస్ఎస్​ను బద్నాం చేస్తే ఊరుకోం : బండి సంజయ్

కరీంనగర్, వెలుగు: బీజేపీని, ఆర్ఎస్ఎస్​ను హేళన చేసేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినా.. బద్నాం చేసినా ఊరుకునే ప్రసక్తే లేదని కరీంనగర్ లోక్​సభ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ హెచ్చరించారు. ఆయనపై లీగల్ చర్యలకు వెనుకాడమని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్  కమాన్ చౌరస్తా వద్ద బుధవారం రాత్రి కేంద్ర మంత్రి మురగన్​తో కలిసి సంజయ్ ​రోడ్డు షో నిర్వహించారు. 

అనంతరం కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. రాముడంటే కాంగ్రెస్ గజగజ వణుకుతోందని.. రాక్షసులు, సైతాన్లు మాత్రమే దేవుడిని చూస్తే వణికిపోతారని ఎద్దేవా చేశారు. ‘రిజర్వేషన్ల రద్దు కోసం 2000 సంవత్సరంలో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్​ను బీజేపీ ప్రభుత్వం నియమించిందని, ఆయనిచ్చిన రిపోర్టును కూడా తొక్కిపెట్టారని చెప్తున్న రేవంత్ రెడ్డిని నేనడుగుతున్నా.. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్సే కదా.. 

మరి ఆ రిపోర్టును ఎందుకు బయటపెట్టలేదు?’ అని ప్రశ్నించారు. రిజర్వేషన్ల రద్దు నాటకం కాంగ్రెస్ కుట్రలో భాగమేనన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు డిపాజిట్లు రావని విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థి నాన్ లోకల్ అని, పదేండ్లు అధికారంలో ఉన్నా కరీంనగర్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ కుటుంబం దోచుకోవడం, దాచుకోవడం తప్ప సాధించిందేమీ లేదని ఆయన మండిపడ్డారు.