మద్నూర్/నిజాంసాగర్, వెలుగు: మూడోసారి కూడా నరేంద్ర మోదీ ప్రధాని కావడం ఖాయమని జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు. గురువారం నిజాంసాగర్ చౌరస్తా నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నిజాంసాగర్ లో ప్రారంభమైన ర్యాలీ పెద్ద కొడప్ గల్, బిచ్కుంద మీదుగా మద్నూర్ మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా జరిగిన మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ, ఈసారి జహీరాబాద్ లో కాషాయ జెండా ఎగురుతుందన్నారు.
తాను చేసిన పనులు, మోదీ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, కామారెడ్డి జిల్లా బీజేపీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే అరుణతార, పార్టీ నాయకులు ఎంబీ పాటిల్, తదితరులు పాల్గొన్నారు.
భారీ బైక్ ర్యాలీ
బీజేపీ గెలుపుకోసం ప్రతి కార్యకర్త సైనికుడిగా పని చేయాలని బీబీ పాటిల్ కోరారు. నిజాంసాగర్ లోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో జరిగిన మీటింగ్లో పాల్గొన్నారు. బీజీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నిజాంసాగర్ నుంచి పిట్లం మీదుగా మద్నూర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార తదితరులు పాల్గొన్నారు.