నిజామాబాద్ అర్బన్, వెలుగు: ఎంఐఎం నేత అసదుద్దీన్‌కు దమ్ముంటే ఇందూరులో ప్రచారం చేయాలని బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యానారాయణ సవాలు విసిరారు. నిజామాబాద్ అర్బన్‌లో బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకే అక్కడ బరిలో నిలవలేదని వికారాబాద్‌లో అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
పార్టీ జిల్లా ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఎన్నికల్లో మతాన్ని అడ్డుపెట్టుకొని 16 సీట్లు గెలిచిన ఎంఐఎం పార్టీ నేత ఇంతలా మాట్లాడితే, అందరి మద్దతుతో 28 సీట్లు గెలిచిన బీజేపీ ఏ స్థాయిలో మాట్లాడాలన్నారు. ఆర్ఎస్ఎస్, భజరంగ్‌దళ్ లాంటి సంస్థలపై విష ప్రచారం చేస్తూ ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని చూస్తున్న వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
అర్బన్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీని ఓడించేందుకు ఇందూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో లీడర్లు లింగం, లక్ష్మీనారాయణ, స్రవంతిరెడ్డి, రాజు, లచ్చన్న పాల్గొన్నారు.