నిజామాబాద్, వెలుగు: గాంధీ పేరును చివర తగిలించుకున్న రాహుల్‌గాంధీ, సోనియా గాంధీ ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ఫెరోజ్జహంగీర్ మనవడైన రాహుల్‌గాంధీకి.. గాంధీ పేరు ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. సెక్యులర్ పేరుతో కాంగ్రెస్ దేశప్రజలను ఏండ్ల తరబడి మోసం చేస్తోందని విమర్శించారు. రాహుల్‌గాంధీ కుటుంబీకులు జహంగీర్లని ముమ్మాటికీ గాంధీలు కాదన్నారు. మంగళవారం ఆయన బీజేపీ నిజామాబాద్ జిల్లా పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు.
ఫిరోజ్ జహంగీర్ భార్య దివంగత ప్రధాని ఇందిరాగాంధీ దేశ ఎమర్జెన్సీ టైంలో రాజ్యాంగంలో సెక్యులర్పదాన్ని చేర్చారన్నారు. రాజ్యాంగాన్ని ఎందుకు మార్చారో రాహుల్సమాధానం చెప్పాలన్నారు. విద్యావ్యవస్థలో రిజర్వేషన్లు తొలగించిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. పదవీ వ్యామోహంతో దేశాన్ని పాకిస్థాన్, బంగ్లాదేశ్‌గా ముక్కలు చేశారని ఆరోపించారు. ఓటు బ్యాంకు కోసం దేశ ప్రజల జీవితాలు నాశనం చేశారని, మత ప్రాతిపదికన అలీఘడ్, జామియా యూనివర్సిటీలు ఏర్పాటు చేసి వాటిలో ముస్లిం రిజర్వేషన్లు మాత్రమే అమలు చేస్తున్నారన్నారు.
భవిష్యత్‌లో ఉస్మానియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల్లో ఈ విధానం వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదన్నారు. రోహ్యింగాలకు, బంగ్లాదేశీయులకు రిజర్వేషన్లు అడుగుతారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఆగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు పెంచారన్నారు. హిందూజాతి మేల్కొనకపోతే అన్యాయం జరుగుతుందన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేశ్ కులాచారి, ఫ్లోర్‌లీడర్ స్రవంతిరెడ్డి, న్యాలం రాజు ఉన్నారు.