ఇక నా విజయాన్ని ఎవరూ ఆపలేరు : కోమటిరెడ్డి రాజగోపాల్

మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారం చేసేందుకు వచ్చిన మంత్రి హరీష్ రావుపై బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. దుబ్బాక, హుజురాబాద్ తర్వాత అగ్గిపెట్టె మంత్రి ఇప్పుడు మునుగోడులో అడుగుపెట్టారని ఎద్దేవా చేశారు. హరీష్ రావు ఎంట్రీతో తన విజయం ఖాయమైందన్నారు. తన విజయాన్ని  ఇక ఎవరూ ఆపలేరని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్లో  తెలిపారు. 


రాజుపేటలో హరీష్ రావు ప్రచారం..

మరోవైపు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీష్ రావు మర్రిగూడెం మండలం రాజుపేటలో పర్యటించారు. గ్రామస్తులతో కలిసి టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ పై నిప్పులు చెరిగారు. నాలుగేళ్ల నుంచి మునుగోడు లో ఏం చేశావు అంటూ ప్రశ్నించారు. మద్యం, డబ్బుతో గెలుస్తామంటున్న బీజేపీ నేతలకు మునుగోడు ప్రజలు బుద్ధిచెప్తారని అన్నారు. రాజగోపాల్‌ రెడ్డి స్వార్థం కోసమే ఉపఎన్నిక వచ్చిందని చెప్పారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజగోపాల్ రెడ్డి ఈ నాలుగేళ్లలో ఒక్కసారైనా గ్రామానికి వచ్చారా అని హరీశ్ రావు ప్రశ్నించారు.