మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు కింద వేతనాలివ్వాలి : మల్క కొమురయ్య

మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు కింద వేతనాలివ్వాలి : మల్క కొమురయ్య

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న పీజీటీ, టీజీటీ టీచర్లతో పాటు ఇతర సిబ్బందికి 010 పద్దు కింద వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కరీంనగర్ – నిజామాబాద్ – మెదక్ – ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్ టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నా..  ప్రతినెలా ఒకటో తారీఖున జీతాలు పొందలేకపోతున్నారని ఆయన  వాపోయారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన రిలీజ్​చేశారు. 

సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు చెప్తున్నట్టు ఒకటో తారీఖున వారికి వేతనాలు ఇవ్వడం లేదని, 15వ తేదీ వరకూ రావడం లేదన్నారు. మోడల్ స్కూళ్లు ఏర్పడి పన్నెండేండ్లు అయిందని, ఇప్పటికీ 37 మంది టీచర్లు చనిపోయారని, వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి బెనిఫిట్స్ అందలేదని తెలిపారు. కారుణ్య నియామకాలు కూడా మోడల్ స్కూళ్లలో కల్పించాలని డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్స్ టీచర్లకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, వారికి మెడికల్ రీయింబర్స్ మెంట్ సౌకర్యం కల్పించాలని కోరారు. 

నోషనల్ సర్వీస్ కల్పించాలని, ప్రమోషన్ల ప్రక్రియ నిర్వహించాలని సర్కారును డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఫస్ట్ ప్రయార్టీ ఓటు వేసి గెలిపించాలని, మోడల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి పోరాడుతానని తెలిపారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే.. టీచర్లతో కలిసి ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు.